KCR Khammam Metting: భారత రాష్ట్ర సమితి తొలి ఆవిర్భావ సభకు ఖమ్మం ముస్తాబయింది.. కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రివాల్, భగవంత్ సింగ్ మాన్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరుకానున్నారు.. ఈ సభకు సంబంధించి భారత రాష్ట్ర సమితి నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.. మంత్రి హరీష్ రావు గత పది రోజుల నుంచి ఖమ్మంలోనే మకాం వేశారు. అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా… తొలి ఆవిర్భావ సభ ద్వారా కేసిఆర్ ఏం చెప్పబోతున్నారు? ఎటువంటి డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు? ఇప్పుడు ఇవి ఆసక్తికరంగా మారాయి.

తెలంగాణను ప్రగతి పథంలో నడిపించామని, ఇక దేశంలో గుణాత్మక అభివృద్ధి తమ లక్ష్యం అని ప్రకటిస్తున్న భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ జాతీయస్థాయిలో సమర శంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. ” అబ్ కీ బార్ కిసాన్ సర్కార్” నినాదంతో జాతీయస్థాయికి విస్తరిస్తామని చెబుతున్న ఆయన… పార్టీ జాతీయ నమూనాను వెల్లడించనున్నారు. తెలంగాణ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించనున్నారు.. ఇందుకు ఖమ్మంలో బుధవారం నిర్వహిస్తున్న తొలి భారీ బహిరంగ సభను వేదికగా చేసుకోనున్నారు.. రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చాము. దీనిని జాతీయ స్థాయికి విస్తరిస్తామని, ప్రజలు ఆశీర్వదించాలని ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ కోరారు. ” అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది తమ నినాదం అని వెల్లడించారు. కానీ ఇప్పటివరకూ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఎటువంటి సభలు నిర్వహించలేదు. భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత తొలిసారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.. దీనికి ముగ్గురు ముఖ్యమంత్రులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు, జాతీయస్థాయి నేతలను ఆహ్వానించారు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలోనే భారత రాష్ట్ర సమితి జాతీయ లక్ష్యాలను సీఎం కేసీఆర్ వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆసరా పింఛన్లు, రైతుబంధు, దళిత బంధు, 24 గంటల విద్యుత్ సరఫరా తదితర పథకాలను తెలంగాణలోనే అమలు చేస్తున్నామని భారత రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్న విషయం తెలిసిందే.. జాతీయస్థాయిలోకి అధికారంలోకి వస్తే ఈ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కూడా ప్రకటిస్తూ వస్తున్నారు.. దశలవారీగా దళిత బంధు అమలుకు ఎంత ఖర్చవుతుందని గణాంకాలనూ ఇప్పటికే చూచాయగా వెల్లడించారు.. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసినందుకు తమ వ్యూహం ఏమిటనే వివరాలను సీఎం కేసీఆర్ సభాముఖంగా వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలను వివిధ సందర్భాల్లో ఎండగడుతున్న కేసీఆర్.. వాటిని పునరుద్ఘాటించడమే కాకుండా.. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రకటించే అవకాశం ఉందని వివరిస్తున్నాయి.. దేశ సమగ్రాభివృద్ధికి, ఆయా రంగాల్లో గుణాత్మక అభివృద్ధికి తమ విధి విధానాలను వెల్లడించనున్నారని తెలిపాయి.
తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ ఆదాయాన్ని డబుల్ చేస్తామని బిజెపి ప్రకటించిందని, కానీ, వ్యవసాయ రంగాన్ని ట్రబుల్ లో పడేసిందని, దేశ రాజధానిలో నెలల తరబడి రైతులు ఆందోళనలు చేయడమే దీనికి నిదర్శనమని వివరించనున్నారని, దేశంలో ప్రస్తుత వ్యవసాయ రంగ పరిస్థితిని వివరించడంతోపాటు తమ అధికారంలోకి వస్తే అనుసరించే విధానాలను చెప్పే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాల అభివృద్ధి పట్ల తమకు ఉన్న ఆలోచనలను ఖమ్మం వేదికగా దేశ ప్రజలకు కేసీఆర్ వివరించే ప్రయత్నం చేయనున్నారు.. అదేవిధంగా ఏపీ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిని ఇటీవల ప్రకటించిన కేసీఆర్… పురుగు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బిజెపి, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు దిశగా కెసిఆర్ తొలి నుంచీ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఆ రెండు కూటముల్లో లేని ఆమ్ ఆద్మీ, సమాజ్ వాదీ, వామపక్షాల పార్టీల నాయకులు ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు హాజరవుతున్నారు.. దేశంలోని వివిధ సంఘాల నాయకులు వస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ కుటమికి ఖమ్మం సభ వేదిక కానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. ప్రత్యామ్నాయ కూటమి ప్రకటన చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేమని వివరిస్తున్నాయి.. ఇదే సందర్భంలో మోడీ వైఫల్యాలను గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం కేసీఆర్ చేస్తారని చెబుతున్నాయి.. పలు సందర్భాల్లో చేసిన విమర్శలు కాకుండా… కేసీఆర్ ఈసారి వ్యూహాత్మకంగా మాట్లాడతారని అంటున్నాయి.. మొత్తానికి ఖమ్మం సభ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది.