KCR Revanth Reddy : తామొకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుందని అంటారు. 2014లో కేసీఆర్ కు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆ పార్టీని ఓడించడానికి కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు. ఈ ఎనిమిదేళ్లలో కాంగ్రెస్ ను చావుదెబ్బ తీశాడు. కానీ కాంగ్రెస్ ను దెబ్బతీస్తే బీజేపీ ఎదుగుతుందని ఊహించలేదు. అదే కేసీఆర్ కొంపకు చేటు అయ్యింది. బీజేపీ బలపడింది. కేంద్రంలో అధికారంలో ఉండి ఇప్పుడు కేసీఆర్ నే మింగేయడానికి రెడీ అవుతోంది. అందుకే బీజేపీని ఓడించడానికి కేసీఆర్ బయలు దేరాడు. ఈరోజు ఖమ్మం సభా వేదిక నుంచి జాతీయ రాజకీయాల్లో వెళుతున్నారు. ఈ మేరకు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభలో పాల్గొనేందుకు ఢిల్లీ, పంజాబ్ , కేరళ సీఎంలు తరలివచ్చారు. వీరంతా కూడా మోడీని బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే నేతలే. ఇక యూపీ నుంచి సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం వచ్చారు. వీరందరినీ కలుపుకొని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పోటీకి దిగబోతున్నారు.

అంతా బాగానే ఉన్న మోడీకి వ్యతిరేకంగా వీళ్లు సొంతంగా రాజ్యాధికారం సాధించలేరు. దేశంలో ప్రత్యామ్మాయంగా సాగలేరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ తోపాటు ఆమ్ ఆద్మీ, కమ్యూనిస్టులకు కాంగ్రెస్ అవసరం ఉంది. వీరందరూ కలిస్తేనే ప్రస్తుత పరిస్థితుల్లో మోడీని ఓడించగలరు. అది జరగాలంటే ఎన్నికలు రావాలి.. అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలి. అయితే కాంగ్రెస్ తో కలవడం కేసీఆర్ కు ఇష్టం లేదు. అలానే తమలో విలీనం అవుతానని మోసం చేసి తెలంగాణలో కాంగ్రెస్ నే ఓడించిన కేసీఆర్ ను నమ్మే పరిస్థితుల్లో సోనియా, రాహుల్ గాంధీ లేరు. అయితే అవసరాలే వీరందరినీ కలుపుతాయి.
దేశంలో బీజేపీ వచ్చేసారి మెజార్టీ ఎంపీ సీట్లు కనుక దక్కించుకోలేకపోతే.. హంగ్ వస్తే మాత్రం కాంగ్రెస్ తో కేసీఆర్, కేజ్రీవాల్, కమ్యూనిస్టులు కలవాల్సిందే. మోడీని గద్దె దించాల్సిందే. అప్పుడు తెలంగాణలోనూ బద్ధ శత్రువులుగా ఉన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసి పనిచేయాల్సిందే. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలున్నాయి. రాజకీయ కక్షసాధింపులున్నాయి. కేసీఆర్ పొడ అంటేనే రేవంత్ రెడ్డికి గిట్టదు. కానీ బలమైన మోడీని ఓడించడం కోసం వీరిద్దరూ కలవకతప్పని పరిస్థితి.
ప్రస్తుతం బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు ప్రధాన శత్రువు మోడీనే. అందుకే బీజేపీ ఓటమి కోసం వీళ్లు కలిసే రోజులు త్వరలోనే వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.