Lions: సూటిగా చూసే కళ్ళు.. గంభీరంగా వేసే అడుగులు.. పదునైన పళ్ళు.. అంతకుమించి దృఢమైన శరీరం.. వేగంగా పరిగెత్తే తత్వం.. ఎంత పెద్ద జంతువునైనా వేటాడే స్వభావం.. అన్నింటికీ మించి అడవిని తన చెప్పు చేతల్లో ఉంచుకునే క్రూరత్వం.. సింహం తీరూ తెన్నుల గురించి వివరించాలంటే పై ఉపమానాలు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. కానీ అలాంటి సింహాన్ని చంపేసే జంతువులు కూడా ఈ భూమండలంపై ఉన్నాయి. ఆ జంతువులు ఏమిటో ఒకసారి తెలుసుకుందామా..
మొసళ్ళు
సరిసృపాల జాతికి చెందిన
మొసళ్ళు చాలా బలవంతమైనవి. ఇవి నీటిలో జీవిస్తాయి. పూర్తి మాంసాహార జంతువులు ఇవి. నీటిలో ఉన్న చేపలు, ఇతర జీవులను వేటాడుతాయి. నీటిని తాగేందుకు వచ్చిన జంతువులపై అమాంతం దాడి చేసి తినేస్తాయి. నీటిని తాగేందుకు నదులు లేదా కొలనులోకి సింహాలు వెళ్లినప్పుడు మొసళ్ళు వాటిపై దాడి చేస్తాయి. అంతేకాదు సమూహంగా ఉండి చంపి తినేస్తాయి. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కెన్యా అడవుల్లో ఇటువంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.
మొసళ్ళ వేటతీరు చూసిన తర్వాత శాస్త్రవేత్తలు..మొసళ్ళు సింహాలను అత్యంత సులువుగా వేటాడుతాయని
అభిప్రాయానికి వచ్చారు.
అడవి గేదెలు
బలమైన కొమ్ములతో బాహుబలి లాంటి అడవి గేదెలు సింహాలను వేటాడుతాయి. కాకపోతే చనిపోయిన సింహాలను తినవు.. వాటి జోలికి సింహాలు వచ్చినప్పుడు సమూహంగా ఏర్పడి బలమైన కొమ్ములతో సింహాలను పొడిచి పొడిచి చంపేస్తాయి. ఈ అడవి దున్నలు కేవలం సమూహంగా ఉన్నప్పుడు మాత్రమే సింహాలపై ఎదురుదాడికి దిగుతాయి. ఒంటరిగా ఉంటే మాత్రం ఆ సింహాలకు ఆహారమవుతాయి.
హైనాలు
నక్క జాతికి చెందిన ఈ జంతువులు అత్యంత క్రూరమైనవి. పదునైన దంతాలతో ఎదుటి జంతువులను చీల్చి చంపి తినేస్తాయి. సాధారణంగా ఈ జంతువులు పులులు లేదా సింహాలు వేటాడినప్పుడు మిగిలిన మాంసాన్ని తింటాయి. అరుదైన సందర్భాల్లో పులులు, సింహాలు వేటాడిన జంతువు మాసాన్ని దౌర్జన్యంగా లాక్కుంటాయి. సమూహంగా ఉండే ఈ జంతువులు ఎదురుదాడికి దిగితే దాని తీవ్రత అధికంగా ఉంటుంది.. సింహం ఒంటరిగా ఉన్నప్పుడు ఈ జంతువులు మీద పడి దాడి చేసి తినేస్తాయి. సింహాలు సమూహంగా ఉన్నప్పుడు మాత్రం దూరంగా పారిపోతాయి.
హిప్పో
జంతువులలో అత్యంత భారీ శరీరం కలిగినవి ఏవైనా ఉన్నాయి అంటే అవి హిప్పో లే. బలమైన దంతాలు వీటికి ప్రధాన ఆయుధం. ఆహారం సరిగా లభించినప్పుడు ఇవి ఎదుటి జంతువు మీద దాడి చేసి తినేస్తాయి.. ఎదురుగా సింహం ఉన్నా కూడా లెక్క చేయవు. వీటి బలమైన అడుగులు సింహం పుర్రెను కూడా నలిపేయగలవు. అందుకే సింహాలు కూడా హిప్పోలు ఎదురుగా కనిపించినప్పుడు దూరంగా వెళ్తాయి.
ఏనుగులు
శాంత స్వభావులుగా కనిపించే ఏనుగులు.. తమ జోలికి వస్తే ఎంతటి జంతువునైనా చంపేయగలవు. గజరాజుగా పేరొందిన ఈ ఏనుగుల జోలికి సింహాలు వెళ్ళవు గాని.. చిన్నచిన్న ఏనుగు కూనలను వేటాడేందుకు ఇష్టపడతాయి. అలాంటప్పుడు పొరపాటున ఏనుగుల మంద ఉంటే సింహాల పని అయిపోయినట్టే. పెద్ద ఏనుగులు ఒక వలయం లాగా నిలుచుంటాయి. అందులో ఏనుగు పిల్లలను ఉంచుతాయి. అడుగు కదలకుండానే ఆ ఏనుగు పిల్ల జోలికి వచ్చే సింహాలను తొండంతో విసిరి కొడతాయి. తొండం దెబ్బకు సింహాలు చనిపోతాయి. అందుకే ఏనుగుల మంద వస్తున్నప్పుడు సింహాలు దూరంగా వెళ్తాయి. అనుకోకుండా తారసపడితే పక్కకు వెళ్లి దాక్కుంటాయి.