
Warangal Police Commissioner Ranganath: ప్రజలకు సహాయం చేసేందుకే అధికారులున్నారు. వారి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం వారికి జీతాలిస్తోంది. కానీ ఎంతమంది తమ విధులు సరైన విధంగా నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో సక్రమంగా లేని వారిని ప్రజలు గుర్తుంచుకోరు. జనం అవసరాలు గుర్తించి వారికి కావాల్సిన పనులు చేసే వారిని మాత్రం గుండెల్లో పెట్టుకుంటారు. గతంలో పోలీస్ శాఖలో పనిచేసిన ఎస్పీ ఉమేశ్ చంద్ర ఉదంతమే దీనికి నిదర్శనం. ఆయన పోలీసుల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఆయన పనితనంతో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు. అలా బాధ్యతలు గుర్తుంచుకుని బతికిన వారికి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారు. అది వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.
వరంగల్ లో..
తాజాగా వరంగల్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వరంగల్ సీపీగా పనిచేస్తున్న రంగనాథ్ ఫ్లెక్సీకి ఓ దివ్యాంగుడు క్షీరాభిషేకం చేశాడు. ఆయన ఫ్లెక్సీకి అలా చేసి తన స్వామి భక్తిని నిరూపించుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా తన భూమి కబ్జాలో ఉందని ఎన్ని పిటిషన్లు ఇచ్చినా ఏ అధికారి కూడా పట్టించుకోలేదు. దీంతో అతడి సమస్య తీరే మార్గమే కనిపించలేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్న అతడికి సీపీ రంగనాథ్ ఆపన్న హస్తం అందించాడు. అతడి భూమిని విడిపించి అతడి బాధలను దూరం చేశాడు.
దేవుడిలా భావించి..
ఈ నేపథ్యంలో అతడు సీపీ చేసిన దానికి ఎంతో ఆనంద పడ్డాడు. తన జీవితంలో పరిష్కారం కాదనుకున్న సమస్యను తీర్చేయడంతో దేవుడిలా భావించాడు. తన భూమిని కబ్జాదారుల చెరలో నుంచి విడిచిపించినందుకు ఉప్పొంగిపోయాడు. తన కుటుంబానికి సాయం చేసిన సీపీని మహాత్ముడిలా అనుకున్నాడు. తనకు సాయం చేసిన సీపీకి జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతున్నాడు. తాను దివ్యాంగుడిని కావడంతో ఎంతమంది అధికారులను కలిసినా పని కాలేదు. కానీ సీపీ రంగనాథ్ చొరవతో పరిష్కారం కావడంపై ఆ దివ్యాంగుడు కన్నీటి పర్యంతమవుతున్నాడు.

అధికారులెందరున్నా..
ఎంతో మంది అధికారులుంటారు. కానీ ఇలా విధులను బాధ్యతగా నిలిచే వారు కొందరే ఉంటారు. వారే ప్రజల్లో గుర్తింపు పొందుతారు. పేదవాడి అవసరాలు గుర్తించి వాటిని తీరిస్తే చాలు వారిని దేవుడిలా కొలుస్తారు. వారికి గుండెల్లో గుడి కడతారు. వారు ఎక్కడున్నా చల్లగా ఉండాలని కోరుకుంటారు. అలా వారు చేసేది చిన్నసాయమే అయినా వారికి ఎంతో గౌరవం ఇస్తారు. ఇలా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.
