
Kanna Lakshminarayana: దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విస్తరించింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. తన జైత్రయాత్ర ను కొనసాగిస్తోంది. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆశించిన పురోగతి లేదు. పార్టీ విస్తరణకు నోచుకోవడం లేదు. ఓట్లు, సీట్లు పెంచుకోవడం లేదు. పోనీ నాయకులు లేరా? అంటే కొదువ లేదు. కానీ అందులో పార్టీకి అక్కరకు వచ్చే వారు కొందరే. గత ఎన్నికలకు ముందు, తరువాత ఎక్కువ మంది బీజేపీలో చేరారు. దీంతో ఇక ఆ పార్టీకి తిరుగులేదని అంతా భావించారు. కానీ వచ్చిన నాయకుల్లో ఎక్కువ మంది తమ అడ్జస్టన్సీ కోసం చేరిన వారే. పూర్వశ్రమంలో పనిచేసిన పార్టీ హితం కోరుకున్నవారే. తీరా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏదో వంకతో తిరిగి మాతృపార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ఏపీ బీజేపీలో మూడు వర్గాలున్నాయన్నది బహిరంగ రహస్యం. వైసీపీ అనుకూల వర్గం, టీడీపీ అనుకూలవర్గం, మూడోది బీజేపీ పాత టీమ్. ఎన్నికల ముందు నుంచి ఒక టీమ్ వైసీపీ కోసం పనిచేస్తుండగా… ఎన్నికల అనంతరం పార్టీలో చేరిన వారు టీడీపీ టీమ్ గా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలవకుండా చేయాలన్నది వైసీపీ అనుకూల టీమ్ టాస్క్. అదే పరిస్థితుల్లో కూటమి కట్టాలన్నది టీడీపీ అనుకూల టీమ్ లక్ష్యం. ఈ నేపథ్యంలో ఈ ప్రయత్నాల్లో భాగంగా బీజేపీలో వర్గపోరు తీవ్రమవుతోంది. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని రాష్ట్ర బీజేపీ చెబుతుండడంతో టీడీపీ అనుకూల బ్యాచ్ పునరాలోచనలో పడింది. అందుకే పార్టీలో విభేదాలు మరింత తారాస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది.
అయితే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు పార్టీలో సీనియర్ నేతలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గత కొద్దికాలంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ సొము వీర్రాజును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలు జీవీఎల్ ఏం చేశారని కాపులతో సన్మానాలు చేయించుకుంటున్నారని ప్రశ్నించారు. కాపుల గురించి రాజ్యసభలో ఆయన ప్రస్తావించిన విషయాలు గుగూల్ సెర్చ్ లో వెతికితే దొరుకుతాయని ఎద్దేవా చేశారు. దీంతో కన్నా పార్టీ క్రమశిక్షణ కట్టుదాటారని కమలనాథులు భావిస్తున్నారు. అయితే కన్నా విషయంలో హైకమాండ్ నాన్చుడు ధోరణిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కన్నా బీజేపీలో ఉన్నారు. ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పవన్, చంద్రబాబుకు అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ సీఎం అయ్యే విషయంలో బయట వ్యక్తులు ప్రభావితం చేయకూడదని.. ఆయన స్వీయ నిర్ణయాలకే వదిలివేయ్యాలని చెప్పారు. వైఎస్ కాపులకు ఈబీసీ రిజర్వేషన్ల కోసం నిర్ణయిస్తే.. దానిని చంద్రబాబు అమలుచేశారని చెప్పారు. దీంతో ఆయన టీడీపీ, జనసేనల గూటికి చేరతారని అంతా భావిస్తున్నారు. అయితే ఆ రెండు పార్టీలతో కలయికకు అడ్డంగా నిలుస్తున్న సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీకి ఒక పరీక్ష పెడుతున్నారు. తనను తాను దూరమవ్వడం కంటే.. పార్టీయే తనను దూరం చేసుకుంటే రాజకీయంగా లబ్ధి ఉంటుందని కన్నా భావిస్తున్నారు.
