
Telangana Secretariat: కెసిఆర్ ఎంతో ముచ్చటపడి కట్టుకుంటున్న సచివాలయం ప్రారంభోత్సవాన్ని తన జన్మదిన సందర్భంగా ఫిబ్రవరి 17న అంగరంగ వైభవంగా నిర్వహించాలి అనుకున్నాడు. ఆదిలోనే హంసపాదు లాగా అది వాయిదా పడింది. దీని ప్రారంభోత్సవానికి బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ వంటి వారిని ఆహ్వానించారు.. భారీ ఎత్తున మీటింగ్ పెట్టి మోదిని కడిగేయాలి, బిజెపిని తూర్పారబట్టాలి అని కేసీఆర్ అనుకున్నాడు. కానీ ఆదిలోనే హంసపాదు లాగా ఆయన వేసుకున్న ప్లాన్ బెడిసి కొట్టింది.
అంతటి కోవిడ్ సమయంలో పాత సచివాలయాన్ని ప్రభుత్వం కూల్చేసింది. దీనికి చెప్పిన కారణం సరైన సౌకర్యాలు లేకపోవడం. రాత్రికి రాత్రే సచివాలయాన్ని కూల్చేసి, దానికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు కూడా మీడియాకు లభించకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది.. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఓ కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. సచివాలయం ఒక దశకు రాగానే మీడియాకు ఫోటోలు పంపింది.. అయితే ఇటీవల సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది.. దాదాపు 6 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు వచ్చాయి.. ఫైర్ ఇంజన్లు వచ్చేందుకు కూడా స్థలం లేకపోవడంతో కొంతమేర ఇబ్బంది ఏర్పడింది. పాత సచివాలయాన్ని సౌకర్యాలు లేని పేరుతో కూల్చేసిన ప్రభుత్వం దీన్ని ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.. ఇక ఒక సెక్షన్ అయితే సచివాలయం మీద ప్రతిపక్షాలు అక్కసు పెంచుకున్నాయని, అగ్ని ప్రమాదంతో ఆ దోషం పోతుందని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇక ఈ సచివాలయం ప్రారంభం కాకముందే ఇందులో జరుగుతున్న పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పై కూడా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. అయితే ఇది ఇలా ఉండగానే ఫిబ్రవరి 17న నూతన సెక్రటేరియట్ ను ప్రారంభించొద్దని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి. ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం ఉండదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. దీంతో సభా వేదిక ఏర్పాట్లు తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం..
