
Vishnu Kumar Raju: ఏపీ బీజేపీలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్టైలే వేరు. ఆయన భౌతికంగా కాషాయదళంలో ఉన్నా.. మనసు మాత్రం పసుపు పార్టీ వైపే ఉంటుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అప్పటి సీఎం చంద్రబాబును ఇంద్రుడు, చంద్రుడు అంటూ వర్ణించేవారు. సినిమా హీరో శోభన్ బాబుతో పోల్చి బాబు అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేసేవారు. 2014 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. కానీ ఇతర బీజేపీ నాయకులకంటే భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారు వైసీపీ, టీడీపీలను విమర్శిస్తే.,, రాజుగారు మాత్రం వైసీపీని, జగన్ ను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో కాపాయ ముసుగు తీసే పనిలో పడ్డారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటే సైకిలెక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
బీజేపీలో టీడీపీకి అనుకూలమైన టీమ్ ఒకటుంది. అందులో విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండాలనుకున్న బలమైన నాయకుల్లో ఈయన ఒకరు. అలా అయితే మరోసారి ఎన్నికల్లో గెలుపొంది ఎంచక్కా మంత్రి కావాలన్నది రాజుగారి అభిమతం. కానీ పరిస్థితులు అంత అనుకూలం కనిపించడం లేదు. అందుకే హైకమాండ్ కు షాకివ్వాలని చూశారు. పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న కన్నా లక్ష్మీనారాయణకు గుంటూరు వెళ్లి కలిసొచ్చారు. పనిలో పనిగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి బాగాలేదని చెప్పుకొచ్చారు. కేంద్ర పెద్దలకు రాష్ట్ర బీజేపీ నేతలతో మాట్లాడేందుకు తీరుబాటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన మాటలను మిగతా రాష్ట్ర బీజేపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. రాజుగారి మనసు తెలుసు కనుక ఆ వ్యాఖ్యలను పట్టించుకునే వారు లేకపోతున్నారు.

వాస్తవానికి విష్ణుకుమార్ రాజు కామెంట్స్ ఎప్పుడూ వైసీపీని టార్గెట్ చేసేలా ఉంటాయి. టీడీపీకి అనుకూలంగా వ్యాఖ్యానిస్తుంటారు. అదే సమయంలో మిగతా బీజేపీ నాయకుల మాటలకు కౌంటర్ ఇచ్చేలా కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఏ నేతలను వదులుకోవడానికి బీజేపీ ఇష్టపడదు కనుక.. రాజుగారు స్వేచ్ఛగా మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కన్నాను కలిసిన తరువాత ఆయన సైకిలెక్కడం ఖాయమని తెలుస్తోంది. కానీ దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. చివరి వరకూ వేచిచూసి పొత్తు కుదిరతే బీజేపీ తరుపున.. లేకుంటే సైకిలెక్కి టీడీపీ తరుపున పోటీచేయాలని రాజుగారు భావిస్తున్నారుట. అందుకే కన్నానుకలిసి హైకమాండ్ కు కాస్తా కలవరపాటుకు గురిచేయాలని భావించారుట. కొద్దిరోజులు ఆగి పరిస్థితులు చూశాక రాజుగారు అడుగులు వేస్తారని టాక్ వినిపిస్తోంది.