Jagan vs Vijayasaireddy : మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా.. ప్రభుత్వంలో నంబర్ :2 గా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. కష్టకాలంలో తనకు అండగా నిలబడినందుకు రాజ్యసభకు పంపించి తన కృతజ్ఞతను జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించారు.. అయితే ఐదేళ్లపాటు వీరిద్దరి మధ్య సఖ్యత సవ్యంగానే సాగింది. కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలియదు గాని.. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మధ్య గ్యాప్ ఏర్పడింది. అది చాలా దూరం వరకు వెళ్లిపోయింది. ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఓడిపోవడం.. 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం.. వంటి పరిణామాలతో వైఎస్ఆర్సిపిలో చీలికలు ఏర్పడ్డాయి. కీలకమైన నేతలు పార్టీ నుంచి విడిపోయారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై నేరుగానే విమర్శలు చేశారు. ఎవరు కూడా వైఎస్ఆర్సిపి నుంచి విజయసాయిరెడ్డి బయటికి వెళ్తారని ఊహించలేదు.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైఎస్ఆర్ సీపీ నుంచి విజయసాయిరెడ్డి బయటికి వెళ్లిపోయారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. విజయ్ సాయి రెడ్డి చేసిన ఆ ప్రకటన తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారింది. అయితే దీని వెనుక కారణాలు ఏమున్నప్పటికీ.. అటు విజయసాయి రెడ్డి గాని.. ఇటు జగన్మోహన్ రెడ్డి గాని ఒక్క మాట కూడా బయటికి మాట్లాడలేదు.
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 7, 2025
ఇటీవల లండన్ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజకీయాలలో విశ్వసనీయత గురించి పదేపదే మాట్లాడారు. రాజకీయాలలో క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేశారని గుసగుసలు వినిపించాయి. జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడిన మూడు రోజులకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. ” వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏమాత్రం లేదు. కాబట్టి రాజ్యసభ పదవిని, పార్టీ పదవిని, రాజకీయాలను వదులుకున్నారని” విజయసారెడ్డి ట్విట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడంతోనే.. విజయసాయిరెడ్డి ఈ విధంగా ట్వీట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాజకీయాలకు వీడ్కోలు పలికిన తర్వాత విజయసాయిరెడ్డి తనకు ఇష్టమైన వ్యవసాయం చేస్తానని ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే తన ఫార్మ్ హౌస్ లో ఉన్న ఫోటోలను ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. మళ్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పరోక్షంగా విమర్శలు చేశారు. ఇటీవల షర్మిల కుటుంబాన్ని విజయసాయిరెడ్డి కలిశారు. ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా విజయసాయిరెడ్డిని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం విశేషం.