Welfare Schemes : ఏపీలో( Andhra Pradesh) సంక్షేమ పథకాల విషయంలో కదలిక వచ్చింది. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా ఓ మూడు పథకాల విషయంలో స్పష్టత ఇచ్చారు. అంటే ఏప్రిల్ లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. మే,జూన్లో ఈ కీలక పథకాలు అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అంటే కూటమి ఏడాది పాలన పూర్తయిన తర్వాత ఈ పథకాలు అమలు చేస్తున్నారన్నమాట. అంటే ఐదేళ్ల కాలంలో ఒక ఏడాది ఎటువంటి పథకాలు అమలు చేయకుండా కాలం గడిపేసారన్న మాట. అంటే చివరి ఏడాది 2029 లో సైతం పథకాలు అమలు చేసే ఛాన్స్ ఉండదన్నమాట. ఈ లెక్కన 2026, 2027, 2028 ఏడాదిలను మాత్రమే పథకాలకు పరిగణలోకి తీసుకుంటారన్నమాట. అంటే చంద్రబాబు ఆలోచన అదుర్స్ కదూ..
* ఆ హామీలు బుట్ట దాఖలు
తాను అధికారంలోకి వస్తే తక్షణం సంక్షేమ పథకాలు( welfare schemes) అమలు చేస్తానని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి తీరుతానన్నారు. రెట్టింపు సంక్షేమాన్ని అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. అవసరమైతే సంపద సృష్టించి మరి ప్రజలకు పంచి పెడతానని ఆర్భాటంగా ప్రకటించారు. సీన్ కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. తొమ్మిదో నెల సమీపిస్తోంది. మరో మూడు నెలల్లో ఏడాది పూర్తవుతుంది. కానీ ఎక్కడి వేసిన గొంగళి అక్కడి మాదిరిగానే ఉంది. ఒక్క పింఛన్ల పెంపు, గ్యాస్ సిలిండర్ పంపిణీ వంటి పథకాలకు మాత్రమే కూటమి ప్రభుత్వం పరిమితం అయింది. మిగతా ప్రధాన సంక్షేమ పథకాలలో కదలిక లేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప.. ఏ పథకం కార్యరూపం దాల్చలేదు.
* పేరు మార్పే మిగిలింది
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన వెంటనే.. రైతు భరోసా పథకం పేరును మార్చారు. అన్నదాత సుఖీభవ గా మార్చి ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో వెంటనే ఈ పథకం అమలు అవుతుందని అంతా భావించారు. కానీ 8 నెలలు గడుస్తున్న అతీ గతీ లేదు. ఇప్పుడేమో మేలో అమలు చేస్తామని లీకులిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా రైతు భరోసాను అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమలు చేసి చూపించారు. ఇప్పుడేమో చంద్రబాబు ఒక ఏడాది కాలాన్ని గడిపేసారు.
* అమ్మ ఒడి అంతే
మరోవైపు అమ్మ ఒడి( Amma vody) పథకాన్ని తల్లికి వందనం పేరిట మార్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. అదిగో ఇదిగో అంటూ కసరత్తు అని హడావిడి చేశారు. కానీ ఈ విద్యా సంవత్సరంలో అమలు చేయలేకపోయారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి.. అంటే జూన్లో అమలు చేస్తామని తాజాగా చెబుతున్నారు. అయితే కూటమిపాలన అప్పటికి ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఒకవేళ అమలు చేస్తే.. ఒక ఏడాది కాలాన్ని హరించేసారన్నమాట. అప్పటికైనా అమలు చేస్తారా? గాలికి వదిలేస్తారా? అన్నది చంద్రబాబుకు తెలియాలి.