
Vidyanjali 2 Cancelled: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై కెసిఆర్ ఆగ్రహం ఇప్పట్లో చల్లారేలాలేదు.. పైగా తనను తాను కేసీఆర్ కు సరైన పోటీదారుగా ప్రొజెక్ట్ చేసుకునే పనుల్లో కేసీఆర్ మరింత తలమునకలవుతున్నాడు.. భారతీయ జనతా పార్టీని బద్నాం చేసే ఏ పనినయినా కెసిఆర్ వదులుకోవడం లేదు. ఆ మధ్య తన కూతుర్ని లిక్కర్ స్కాం లో ఈ డీ విచారిస్తే.. రెండో మాటకు తావు లేకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్టు చేయించాడు. అంతకుముందు మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులో ఏకంగా బిజెపి జాతీయ కార్యదర్శిని బయటికి లాగాలని చూసాడు. కెసిఆర్ పెట్టిన కేసుల్లో నియత్ ఉందా లేదా అనేది పక్కన పెడితే.. మోదీ తో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఉన్నానని బయట జనాలకు హింట్ ఇచ్చాడు.. మోదీ పై నిరసన వ్యక్తం చేయడంలో కెసిఆర్ ఎక్కడా కూడా తగ్గడం లేదు. తాజాగా కెసిఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఇప్పుడంటే అదానీ, మోదీ ద్వయం మీద విమర్శలు వస్తున్నాయి గాని.. ఒకప్పుడు ఆదాని ప్రాపకం కోసం చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడ్డాయి. అందులో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఒకటి.. అప్పట్లో అదానికి చెందిన విమానంలోనే కెసిఆర్ ప్రయాణించాడు. పలు సందర్భాల్లో ఆదానిని కేటీఆర్ కలిశాడు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరాడు. ఇప్పుడు మోదీ తో పడటం లేదు కాబట్టి, మోదీ కి ఇష్టమైన ఆదానిపై ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, కెసిఆర్ ప్రభుత్వం, ఆయన సొంత మీడియా అదానీ పై గుడ్లు ఉరుముతున్నాయి. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం, అదానీ ఆధ్వర్యంలో అమలు చేసే పథకానికి కూడా కెసిఆర్ ఫుల్ స్టాప్ పెట్టాడు. మోదీ ని ఢీకొట్టడానికి మరింత ముందుకే అని సంకేతాలు ఇచ్చాడు.
అప్పట్లో అంటే 2021 సెప్టెంబర్లో పాఠశాలల్లో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్, కెరియర్ గైడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ వంటివి నేర్పించే విద్యాంజలి _2 అనే కార్యక్రమానికి అదానీ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. నాణ్యమైన విద్య అందేలా చేయడం, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం. ఈ పథకంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, సైకాలజిస్టులు వాలంటీర్లుగా పని చేస్తారు.. యోగా, డిజిటల్ స్కిల్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇస్తారు. ప్రతిభావంతులైన విద్యార్థులను మరింత సాన పెడతారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. వివిధ క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రత్యేక సహకారాలు అందిస్తారు.. ఇక బాలికలకైతే సెల్ఫ్ డిఫెన్స్ లో శిక్షణ ఇస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ పథకం పలు రాష్ట్రాల్లో అమల్లో ఉంది.

అయితే ఈ పథకాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 7న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.. వాస్తవానికి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ పథకానికి నిధులు మొత్తం ఆదాని ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఏపీఎల్ హెల్త్ కేర్ ఫౌండేషన్ సమకూర్చుతాయి. ఈ సంస్థలు కూడా తమ సమ్మతిని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి.. అయితే కుదిరిన ఒప్పందం ప్రకారం విద్యార్థులకు అవసరమైన డెస్క్ టాప్ లు, ఇతర పరికరాలను ఉచితంగా అందించేందుకు ఆదాని, ఏపీఎల్ సంస్థలు ముందుకు వచ్చాయి.. అయితే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… ఆదాని గ్రూపు నిర్వహించే ఈ పథకాన్ని రాష్ట్రంలో రద్దు చేయాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 2న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ ను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓవైపు ఆదాని గ్రూపుపై ఆరోపణలు చేస్తూ, మరోవైపు ఆయన కంపెనీ సమర్పించే పథకాన్ని అమలు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావనతోనే ఈ పథకాన్ని రద్దు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. మరోవైపు విద్యార్థులకు మంచి చేసే పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయడం పనికిమాలిన చర్య అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.