Homeజాతీయ వార్తలుVacant Commissions: కుర్చీ వేస్తే సీఎం కూర్చోడు.. ఖాళీ కుర్చీల్లో అధికారులను నియమించడు: ఇదీ తెలంగాణ...

Vacant Commissions: కుర్చీ వేస్తే సీఎం కూర్చోడు.. ఖాళీ కుర్చీల్లో అధికారులను నియమించడు: ఇదీ తెలంగాణ మోడల్

Vacant Commissions
Vacant Commissions

Vacant Commissions: మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చాడు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాడు. వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కి వర్తమానం పంపాడు. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు రావాలని కబురు కూడా పంపాడు. కుర్చి కూడా వేశాడు. కానీ ముఖ్యమంత్రి రాలేదు. ఆ కుర్చీలో కూర్చోలేదు. ఫలితంగా ఆ కుర్చి ఖాళీగా దర్శనం ఇచ్చింది. అక్కడికి వెళ్లేందుకు ఇష్టం లేక, ఆ కుర్చీలో కూర్చున్నందుకు మనసు ఒప్పక కెసిఆర్ దానిని ఖాళీగా ఉంచాడు. అంతేకాదు అలాంటి కుర్చీలు నేడు తెలంగాణలో చాలా ఖాళీగా ఉన్నాయి.. ఫలితంగా ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీనిపై ఏమైనా అంటే వారిపై తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేసేందుకు భారత రాష్ట్ర సమితి ఏమాత్రం వెనుకాడటం లేదు.

కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సాధారణ పౌరులకు సమస్య ఎదురైనప్పుడు ఏ దిక్కూ లేని పరిస్థితుల్లో న్యాయం కోసం ఆశ్రయించే స్వతంత్ర సంస్థలు.. తమ ఉనికినే కోల్పోతున్నాయి. సామాన్యులకు ఎవరి నుంచి ఎటువంటి హాని జరిగినా, అపాయం పొంచి ఉన్నా తామున్నామని భరోసానివ్వాల్సిన కమిషన్లు.. నియామకాలకు నోచుకోక వెలవెలబోతున్నాయి. నెలలు, ఏళ్ల తరబడి ఆయా కమిషన్లను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడమే ఇందుకు కారణం. కమిషన్ల చైర్మన్‌, సభ్యుల పదవీకాలం ముగిసినా.. పునరుద్ధరణ చేపట్టకపోవడంతో అవి ఖాళీ కమిషన్లుగా ఉండిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్న ఆరోపణలు
వస్తున్నాయి. సాధారణంగా పౌరుల హక్కులకు భంగం కలిగినా, అధికారులు, ప్రత్యర్థుల నుంచి అపాయం పొంచి ఉన్నా బాధితులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తుంటారు. కానీ, కొన్ని నెలలుగా హక్కుల కమిషన్‌.. చైర్మన్‌, సభ్యులు లేకుండా స్తబ్దంగా మిగిలిపోయింది.

గడువు ముగిసింది

రాష్ట్ర సమాచార కమిషన్‌ గడువు గత ఫిబ్రవరిలో ముగిసినా.. పునరుద్ధరణపై ప్రభుత్వం ఇప్పటివరకు దృష్టి సారించలేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఖాళీ అయి దాదాపు రెండేళ్లవుతున్నా.. ప్రభుత్వం ఇంతవరకూ నియామకానికి చర్యలు తీసుకోవడంలేదు. వినియోగదారుల ఫోరం అధ్యక్షుడి పదవీ విరమణ తర్వాత సీనియర్‌ సభ్యుడికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు.

హెచ్చార్సీకి చుక్కాని లేదు

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ) చుక్కాని లేని నావగా మారింది. దాదాపు నాలుగు నెలలుగా హెచ్చార్సీ చైర్మన్‌ పోస్టు ఖాళీగా ఉంది. చైర్మన్‌, సభ్యుల పదవీకాలం గత డిసెంబరులో ముగియడంతో.. అప్పటినుంచి హెచ్చార్సీ పనితీరు నెమ్మదించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర హెచ్చార్సీ మొదటి చైర్మన్‌గా జస్టిస్‌ చంద్రయ్యను 2019 డిసెంబరు 23 ప్రభుత్వం నియమించింది. ఆయన మూడేళ్ల పదవీకాలం 2022 డిసెంబరు 22తో ముగిసింది. కమిషన్‌ సభ్యులపదవీకాలం కూడా ముగిసింది. దీంతో అప్పటినుంచి అన్ని కుర్చీలూ ఖాళీగానే ఉన్నాయి. రెండు నెలలుగా దాఖలైన పిటిషన్లన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. పోలీస్‌ అధికారుల వేధింపులు, ప్రభుత్వ ఉద్యోగులతో ఎదురవుతున్న ఇబ్బందులు.. ఇలా అనేక సమస్యలపై రాష్ట్రంలోని నలు మూలల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో బాధితులు న్యాయం కోసం హెచ్చార్సీని ఆశ్రయిస్తుంటారు. సగటున రోజుకు 30 పిటిషన్లు హెచ్చార్సీలో దాఖలవుతాయి. అవన్నీ ఇప్పుడు విచారణ లేకుండా మిగిలిపోయాయి. కాగా, హెచ్చార్సీ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్యతోపాటు సభ్యుల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందని అంతా భావించారు. కానీ, ఇప్పటివరకు ఇందుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.

సమాచార కమిషన్‌ ఖాళీ..

సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రధాన కమిషనర్‌గా డాక్టర్‌ ఎస్‌.రాజా సదారాం, కమిషనర్‌గా బుద్దా మురళిని నియమించింది. ప్రధాన కమిషనర్‌ రాజా సదారాం పదవీకాలం 2022 ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి నుంచి కమిషనర్‌ బుద్దా మురళికి ప్రధాన కమిషనర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అనంతరం బుద్దా మురళి పదవీ కాలం గత సెప్టెంబరులో ముగిసింది. అప్పటి నుంచి ప్రధాన కమిషనర్‌, కమిషనర్‌ బాధ్యతలు ఎవరికీ అప్పగించకుండా ప్రభుత్వం ఖాళీగా ఉంచింది. ఈ ఏడాది ఫిబ్రవరితో కమిషన్‌ గడువు కూడా ముగిసింది. దీంతో పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా.. ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. పైగా, సమాచార కమిషన్‌ కొనసాగింపును నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కమిషన్‌కు శాశ్వత భవన నిర్మాణానికి ప్రభుత్వం గతంలో గచ్చిబౌలిలో ఎకరం స్థలం కేటాయించడం గమనార్హం.

Vacant Commissions
Vacant Commissions

ఏళ్ల తరబడి.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఖాళీ

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఖాళీ అయి దాదాపు రెండేళ్లు అవుతున్నా.. ప్రభుత్వం ఇంతవరకూ నియామకానికి చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా రాష్ట్రంలోని గిరిజనులు, దళితులు తమ సమస్యలకు చెప్పుకొనేందుకు అవకాశమే లేకుండా పోయింది. కమిషన్‌ నియామకం విషయంలో హైకోర్టు కలుగజేసుకొని నోటీసులు జారీ చేసినా.. సర్కారు స్పందించలేదు. 2018 నాటి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పదవీకాలం 2021 ఫిబ్రవరికే పూర్తయినా ఇప్పటివరకు నూతన చైర్మన్‌ను, సభ్యులను నియమించలేదు. దీంతో తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ప్రతిసారీ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, దళిత, గిరిజన వర్గాలపై 2022లో రాష్ట్రవ్యాప్తంగా 12,864 దాడులు జరిగినట్లు సమాచారం. 2018-2021 మధ్య పనిచేసిన ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ తన హయాంలో 14 వేల కేసులకుగాను దాదాపు 13వేల కేసులను పరిష్కరించడంతోపాటు బాధితులకు సుమారు 80కోట్ల పరిహారం అందించింది. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ లేకపోవడంతో జరిగిన దాడులన్నింటిలోనూ బాధితులకు న్యాయం జరగడంలేదు. తమకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించేవారు లేక దళిత, గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version