Jagan Stickers: ఏ రాజకీయ నాయకుడి భవితవ్యాన్నైనా తేల్చాల్సింది ప్రజలు. అయితే ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. నేనే మీ భవిష్యత్ నంటూ జగన్ బలవంతపు స్లోగన్ పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. తన అల్లరి మూకను నేరుగా ప్రజల్లోకి పంపుతుండడం వికటిస్తోంది. మా నమ్మకం నువ్వే జగనన్న అనిపించడానికి వారు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. ఆ మాట అనేందుకు ప్రజలు అంగీకరించడం లేదు. అయినా సరే అనాల్సిందే అని హెచ్చరికలు వస్తుండడంతో ఇదేం ఖర్మరా బాబూ అంటూ నిట్టూర్చాల్సిన పరిస్థితి ఎదురైంది. పథకాలు పేరు చెప్పి ఇంటి గోడలపై బలవంతంగా స్టిక్కర్లు అతికిస్తున్నారు. కానీ సమాజం పట్ల, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అవగాహన ఉన్న వారికి ఈ చర్యలు రుచించడం లేదు. కొన్నిచోట్ల బాహటంగానే ప్రతిఘటిస్తున్నారు. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతులేని విజయాలతో నమ్మకం..
జగన్ తన మూడేళ్ల పాలన పూర్తయిన తరువాత ప్రజలు మంచి మార్కులే వేస్తారని భావించారు. అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లోఅంతులేని విజయాన్ని కట్టబెట్టడంతో ప్రజలపై మరింత నమ్మకం పెట్టుకున్నారు. అయితే తొలి మూడేళ్ల వరకూ సీఎం జగన్ ఆలోచన వాస్తవానికి దగ్గరగా ఉండేది. అందుకే తాను మీట నొక్కుతున్నాను… మీరు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ బాధ్యులకు టాస్క్ ఇచ్చారు. దానిని గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం అంటూ పేరు పెట్టారు.అయితే ఇలా పలకరించడానికి వెళ్లిన ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రజల నుంచి తిరస్కరణలే ఎదురయ్యాయి. ఇప్పుడు కొత్తగా మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వలంటీర్లు, సచివాలయ గృహసారధులకు పురమాయించారు. స్టిక్కర్లు అతికించే క్రమంలో వీరికి ఎక్కడికక్కడే ప్రతిఘటనలు ఎదురువుతున్నాయి.
ప్రజల ఆలోచన వేరే విధంగా..
కేవలం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం.. ఆర్థిక అసమానతలు లేకుండా చేస్తున్నాం అని జగన్ భావిస్తున్నారు. కానీ ప్రజలు అలా భావించడం లేదు. పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి చార్జీలు, పన్నులు పిండుకోవడాన్ని గుర్తిస్తున్నారు. పథకాలతో వచ్చిన సొమ్ము.. పన్నులు, చార్జీలతో పోయిన సొమ్మును సరిచూసుకుంటున్నారు. లెక్క కట్టి మరీ జరుగుతున్న అన్యాయాన్ని గ్రహిస్తున్నారు. అందుకే పథకాలు ఇచ్చామన్న వారికి సరైన సమాధానం చెబుతున్నారు. ఊరకనే ఇస్తున్నారా? అని మహిళలు హెచ్చరించే వరకూ పరిస్థితి వస్తోంది. దీంతో బలవంతపు స్లోగన్ ఇచ్చే అల్లరిమూకకు ఎక్కడికక్కడే చెక్ పడుతోంది. అంతెందుకు మంత్రి ధర్మాన లాంటి సీనియర్లకు సైతం ప్రజల నుంచి ఇటువంటి ప్రతిఘటనే ఎదురయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్తే ప్రజల ఆగ్రహం మరింత రెట్టింపవుతోందన్న రిపోర్టులు సైతం వస్తున్నాయి. అసలు సమస్యలు పరిష్కరించకుండా ఓట్ల కోసం మాత్రం పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారని కామెంట్స్ పెరుగుతున్నాయి.
అభివృద్ధిని గుర్తుచేసుకుంటూ…
నాలుగేళ్ల పాటు అభివృద్ధిని గాలికొదిలేశారు. సంక్షేమంతో పాటు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్న విషయం మరిచిపోయారు. అటు నిధులు లేక పథకాల మీట నొక్కుడు గతి తప్పుతోంది. పథకాల లబ్ధిదారుల్లో కూడా కోత పడుతోంది. ఇటీవల పథకాలకు మీటలు నొక్కినప్పటికీ ఖాతాల్లో జమ కావడం లేదు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పూర్తిగా పక్కన పడిపోయింది. ఏడాది మొత్తం ఫీజులు నాలుగు విడతల్లో ఇస్తామని చెప్పి ఒక్క విడతే మీట నొక్కారు. అవి కూడా రాలేదు. మీట నొక్కి వారం పది రోజులు అవుతున్నా ఆసరా డబ్బులు ఇంకా జమ కాలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రజల్లో ఆర్థిక అసమానతలు లేకుండా చూస్తానన్న జగన్…. పథకాల లబ్ధిదారుల జాబితాలో అసమానతలు చూపిస్తున్నారు. దీంతో పథకం పొందిన వారిలో సంతృప్తి లేదు. పథకం పొందని వారిలో వ్యతిరేకత పెరుగుతోంది. అందుకే ప్రజల భవిష్యత్ కావాలనుకుంటున్న జగన్ ను చూసి… ఏపీ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వారధులుగా వస్తున్న గృహసారథులను తిప్పి పంపుతున్నారు.