
Twitter New CEO: పుర్రెకో బుద్ది…జిహ్వకో రుచి అంటారు పెద్దలు.. ఏ ముహూర్తానయితే ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాడో అప్పటినుంచి ఈ సామెతను ట్విట్టర్ సీఈవో ఎలాన్ మాస్క్ నిజం చేస్తూనే ఉన్నాడు.. పరాగ్ అగర్వాల్ ని, గద్దె విజయ కు ఉద్వాసన… బ్లూ టిక్ కు రెంట్ వసూలు,ఉద్యోగుల తొలగింపు, ఖర్చు ఆదా లో భాగంగా జీతాల కోత… ఇవన్నీ కూడా ఆ తాలుకూ ఉదాహరణలే.. అంతేకాదు విభిన్నమైన మనస్తత్వంతో నిర్ణయాలు తీసుకునే మస్క్ వార్తల్లో వ్యక్తిగా ఉంటూ ఉంటాడు.
వాస్తవానికి ట్విట్టర్ కొనుగోలుకు ముందే ఎలాన్ మస్క్ పలు విధాలుగా మాట్లాడాడు. కొంటానని కొద్దిసేపు, కొననని కొద్ది సేపు.. ఇలా కొద్ది నెలపాటు పొద్దుపొచ్చాడు.. తర్వాత ఒకరోజు అందరికీ షాక్ ఇస్తూ ట్విట్టర్ ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించాడు. ఆ తర్వాత ప్రతిరోజు షాక్ ఇస్తూనే ఉన్నాడు.. తాజాగా అలాంటిదే మరో నిర్ణయం తీసుకున్నాడు. ట్విట్టర్ సీఈవో గా తన పెంపుడు కుక్క ఫ్లోకీ ని అనౌన్స్ చేశాడు. ట్విట్టర్ ఆఫీసులో సీఈవో టీ షర్ట్ వేసుకున్న ఉన్న కుక్క ఫోటోను ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఫ్లోకీ ఇది వరకు ఉన్న ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ కంటే మెరుగ్గా పనిచేస్తుందని క్యాప్షన్ పెట్టాడు. దీనిపై స్పందించిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత అప్పుడు సీఈఓ గా ఉన్న అగర్వాల్ ని పదవి నుంచి తొలగించాడు. కొందరు కీలక ఉద్యోగులకు ఉద్వాసన పలికాడు. ట్విట్టర్ విషయంలో మస్క్ తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీన్ని గమనించిన మస్క్ తాజాగా ” ట్విట్టర్ సీఈవోగా నేను ఉండాలా? దిగి పోవాలా అని ట్విట్టర్ లో పోల్ పెట్టాడు. దీనికి ఓటింగ్ వేసిన పది మిలియన్ నెటిజన్లు పోవాలి అని జవాబు ఇచ్చారు. దీంతో మస్క్ పెంపుడు కుక్క కు ట్విట్టర్ బాధ్యతలు అప్పజెబుతూ నిర్ణయం తీసుకున్నాడు. తనను కాదన్నా నెటిజన్లకు తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.