Twitter Logo X: ట్విట్టర్ ఎక్స్‌.. ఆ నాటి నుంచి కంటి మీద కునుకు లేదు

ట్విట్టర్‌ పేరు మార్చడమేమో గానీ అది నా చావుకొచ్చిందంటున్నాడు క్రిస్టోఫర్‌ఓబీలే అనే ఓ యూజర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Written By: Bhaskar, Updated On : August 5, 2023 3:49 pm

Twitter Logo X

Follow us on

Twitter Logo X: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. ట్విట్టర్‌ పిట్ట ఎగిరిపోయి.. దాని స్థానంలో ఎక్స్‌ వచ్చిన నాటి నుంచి ఓ యూజర్‌ నరకం చూస్తున్నాడు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. “కంటికి కునుకు లేదు. దేహానికి విశ్రాంతి లేదు. ఈ పాడు జీవితమంటూ” వైరాగ్యపు పాటలు పాడుతున్నాడు. ట్విట్టర్ లోగో ను ఎక్స్‌ గా మార్చి ఎలాన్‌ మస్క్‌ ఎగిరి గంతేస్తుంటే.. మరి ఈ యూజర్‌ ఎందుకు ఇలా చేస్తున్నాడో మీరూ చదివేయండి.

ట్విట్టర్‌ పేరు మార్చడమేమో గానీ అది నా చావుకొచ్చిందంటున్నాడు క్రిస్టోఫర్‌ఓబీలే అనే ఓ యూజర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ట్విట్టర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఎదురుగా నివాసముండే క్రిస్టోఫర్‌ఓబీలే కొత్తగా ఏర్పాటు చేసిన ఎక్స్‌ లోగో నుంచి వచ్చే లైటింగ్‌ నాకు నిద్ర లేకుండా చేస్తోందని ట్విట్టర్ వేదికగా ఒక వీడియోతో సహా విషయాన్ని పోస్ట్ చేసి, ఆవేదన వెళ్లగక్కాడు. ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నించే పాపులర్ ఎంటర్ ప్రెన్యూర్ ఎలాన్ మాస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత పిట్ట బొమ్మను తొలగించాడు. దాని స్థానంలో ఎక్స్ లోగోను పరిచయం చేశాడు. ట్విట్టర్ పేరు మార్పు గురించి ఆ కంపెనీ సీఈవో మస్క్ ప్రకటించిన నాటి నుంచి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. చాలామంది దీని గురించి ఎగతాళి చేస్తుంటే.. కొంతమంది మాత్రమే బాగుందని చెబుతున్నారు..

ఇదంతా కొనసాగుతుండగానే కాలిఫోర్నియాలోని ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా నివాసం ఉంటున్న క్రిస్టోఫర్ ఓబిలే మాత్రం “ఈ లోగో మార్పు వల్ల నాకు నిద్ర ఉండటం లేదని.. కంపెనీ హెడ్ క్వార్టర్స్ పైన అమర్చిన రేడియంట్ లైట్ గడియకు వెలుగుతూ.. ఎదురుగా ఉన్న పెద్ద భవనం పైన దాని ప్రతిబింబం పాడటంతో అసలు నిద్ర పట్టడం లేదు. బెడ్ రూమ్ నుంచి చూస్తే ఇలా ఉంది. ఇదీ నా పరిస్థితి అంటూ” ఒక వీడియోను పోస్ట్ చేశాడు. దానికి రోజువారి అనుభవాలను కూడా పంచుకున్నాడు. ” పగలు మొత్తం ఆ దీపాల పనితీరు పరీక్షిస్తారు. రాత్రి అయ్యేసరికి కళ్ళు మిరమెట్లు గొలిపే వెలుతురు నా పడక గదిలోకి వస్తుంది చూడండి” అంటూ రాసుకొచ్చాడు. ఇక అతడి వీడియోను చూసిన చాలామంది రకరకాలుగా స్పందిస్తున్నారు. మస్క్ మీద విమర్శల గుప్పిస్తున్నారు. ట్విట్టర్ కొత్త లోగో జనాలను ఆకట్టుకోవడం అనే విషయాన్ని పక్కన పెడితే.. చాలామందికి నిద్ర లేని రాత్రులను పరిచయం చేస్తోందంటూ కౌంటర్లు ఇస్తున్నారు.