Valentine Day Troll: ప్రేమంటే రెండు హృదయాల ఘర్షణ. అది ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో తెలియదు.. ఇక ప్రేమ పుట్టిన వాళ్లు దాన్ని వ్యక్తపరిచేందుకు నానా ఇబ్బందులు పడుతుంటారు.. ఇందులో కొందరు తమ స్నేహితుల సహాయం తీసుకుంటారు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిదీ సులభం అయిపోయింది..అలాగని చెప్పగానే వెంటనే ఒప్పేసుకునేంత సీన్ అబ్బాయిలకు అమ్మాయిలు ఇవ్వడం లేదు.. ఎందుకంటే వాళ్ళ లెక్కలు వాళ్లకు ఉన్నాయి.
ఇలాంటి లెక్కల్లో బతికే ఓ అమ్మాయిని ఓ యువకుడు ప్రేమించాడు.. ఎన్నాళ్ళు ఈ వన్ సైడ్ లవ్ చేయగలవు? స్నేహితులు ఇదే ప్రశ్న వేసేసరికి అతనిలో ఆలోచన పుట్టింది. ఎన్నాళ్ళు ఇలా? ఆర్య సినిమాలో అల్లు అర్జున్ లా? నేనేం అర్జున్ ని కాదు. తను అనురాధ మెహతా అంత కన్నా కాదు. ఆలోచనలో పడ్డాడు. తినడం తగ్గించాడు. పనస పండులా ఉండేవాడు అరటి పండు సైజ్ కు వచ్చాడు. ఇక లాభం లేదు అనుకుని నచ్చిన నెచ్చెలి కి మనసులో మాట చెప్పాలి అనుకున్నాడు. ఎలాగూ తన నంబర్ ఉంది. ఇంకేముంది ఫిబ్రవరి 13న రాత్రంతా మేల్కొని అర్థరాత్రి12 కాగానే ఫోన్ చేశాడు. ” నేను ఎన్నాళ్ళ నుంచో నేను ప్రేమిస్తున్నా. నా ప్రేమను ఓకే చెయ్యి అని” కోరాడు.
కానీ ఆ యువకుడు ఒకటి తలిస్తే విధి ఒకటి తలచింది. తన ప్రేమను వ్యక్తపరుస్తుంటే అమ్మాయి వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తింది.. అది మొత్తం విన్నది. దాన్ని ఊరంతా వినిపించింది. పంచాయితీ ఉంది అని పది మందిలోకి లాగింది. ఇంకే ముంది వాలెంటైన్స్ డే నాడు ఆ యువకుడు మజ్ను అయ్యాడు. ” ప్రేమ లేదని…ప్రేమించ రాదని… సాక్ష్యమే ఈ ఫోన్ అని.. ఓ ప్రియా జోహారులూ” అనుకుంటూ విరహ గీతం ఆలపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.