Chandrababu: కన్ను తెరిస్తే జననం.. కన్నుమూస్తే మరణం..రెప్ప పాటు ఈ జీవితమని.. మనిషి జీవితం గురించి వెనకటికి ఒక కవి చెప్పిన మాటలు ఇవి. నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో కూడా 8 మంది టీడీపీ కార్యకర్తల ప్రాణాలు కూడా రెప్పపాటులోనే గాలిలో కలిసిపోయాయి. విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే వారి కుటుంబాలకు తలా ఒక పది లక్షల ఎక్స్ గ్రేషియా, వారి పిల్లల చదువు బాధ్యత ఎన్టీఆర్ ట్రస్ట్ చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. కానీ యాదృచ్ఛికంగా ఆ సభను మళ్ళీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతున్న సభ వేదిక ముందు ఓ మహిళ చేస్తున్న డ్యాన్స్ ను చూపిస్తూ ఇలాంటి ఉత్సాహమే నా స్ఫూర్తి నింపుతుందని నెత్తి మాసిన వ్యాఖ్యలు చేశారు.

ప్రాణం అంటే అంత నిర్లక్ష్యమా
వాస్తవానికి నిన్న చంద్రబాబు నిర్వహించిన సభ ప్రాంగణంలో గట్టిగా నాలుగు వేల మందికి మించి పట్టరు. కానీ జనాన్ని బాగా తరలించడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. దీంతో కొంతమంది టీడీపీ అభిమానులు గోడలు, మిద్దెలు, రేకుల షెడ్లు ఎక్కారు. అంతమంది ఒకేసారి ఎక్కడంతో రేకుల షెడ్డు కూలిపోయింది. తొక్కిసలాట జరగడంతో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది కాలువలో పడి చనిపోయారు. దీంతో అక్కడ ఒక రకమైన భయానకమైన వాతావరణం ఏర్పడింది. ఇలాంటి స్థితిలో వేరే వారెవరైనా కూడా మీటింగును నిలుపుదల చేస్తారు. కానీ అక్కడ ఉన్నది చంద్రబాబు. ఆయనకు వ్యవసాయం అంటే శుద్ధ దండగ. కార్యకర్తలు అంటే ఓటు వేసే యంత్రాలు. సమావేశాలకు హాజరయ్యే బీరు, బిర్యానీ ప్యాకెట్ గాళ్ళు. జరగరానిది జరిగితే ప్రాణాలు కోల్పోయే పది లక్షల పరిహారానికి నోచుకునే అల్ప జీవులు. ఎల్లో మీడియాకు ఫ్రంట్ పేజీ విషాద శీర్షికలయ్యే బడుగు జీవులు.. అంతే అంతకుమించి ఏమీ ఉండదు.
నాడు పుష్కర ఘాట్ లో

చంద్రబాబు పర్యటనలో మనుషులు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు ఇదే తీరున జన సందోహం అక్కడికి వచ్చింది. అప్పట్లో ఆయన కులానికి చెందిన బోయపాటి శ్రీను అనే దర్శకుడికి ఏదో షూట్ బాధ్యత అప్పగించారు. దానికోసం భక్తులను అప్పటిదాకా నిలువరించారు. తర్వాత అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా భక్తులు తీసుకొచ్చారు. తొక్కిసలాట జరిగింది. చాలామంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.. కొంతమంది గాయపడ్డారు. అప్పట్లో అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి వారికి పరిహారం ఇచ్చారు. చివరికి ఎల్లో మీడియా తేల్చింది ఏమయ్యా అంటే.. భక్తుల్లో క్రమశిక్షణలో లోపించింది. అందుకే ఒకరిని ఒకరు తోసుకుంటూ ముందుకు వచ్చారు. వీటిలో పడి చచ్చారు.. ఒకవైపు ప్రాణ నష్టం జరిగినప్పటికీ చంద్రబాబు తన వ్యక్తిగత సోత్కర్షకే పరిమితం కావడం నిజంగా దారుణాతి దారుణం.. ఆయన నిర్వహిస్తున్న “ఏం ఖర్మ ఈ రాష్ట్రానికి” వల్ల ఆ టిడిపి కార్యకర్తలకు నిజంగానే ఖర్మ పట్టుకుంది. అది ఎవరి రూపంలో అంటే చెప్పాల్సిన పనిలేదనుకుంటా.