BRS MLAs Poaching Case: కొడితే బీజేపీ కుంభస్థలాన్నే కొట్టాలని భావించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేల ఎర కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది. ఈమేరకు జారీ చేసిన జీవో68 చెల్లదని ప్రకటించింది. వెంటనే సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన తుది కాపీ కూడా బుధవారం ప్రభుత్వానికి, సీబీఐకి అందింది. హైకోర్టు కూడా దీనిని పబ్లిక్ డొమైన్‌లో పెట్టింది.

డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని..
హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈమేరకు సిట్ ద్వారానే పిటిషన్ వేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు గురువారం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సీబీఐ విచారణ జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరే అవకాశం కనిపిస్తోంది.
దర్యాప్తు వివరాల లీక్‌పై కోర్టు ఆగ్రహం..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ విచారణ చేస్తుండగానే.. బీజేపీ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆడియోలు, వీడియోలు బయటకు ఎలా లీక్ అయ్యాయో చెప్పాలని ప్రశ్నించింది. దర్యాప్తు వివరాలు కూడా మీడియాకు ఎలా అందుతున్నాయని ప్రశ్నించింది. సీఎం కేసీఆర్ ఈ కేసుపై ప్రెస్‌మీట్‌పెట్టి నిందితులను దోషులుగా ప్రకటించడాన్ని తప్పు పట్టింది. వీటి ఆధారంగానే సిట్ రద్దుచేసి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని తీర్పు చెప్పింది.
పబ్లిక్ డొమైన్‌లో జడ్జిమెంట్ కాపీ
కేసుకు సంబంధించి 45 అంశాలను బేస్ చేసుకుని సీబీఐకి కేసు అప్పగించినట్టు జడ్జిమెంట్‌లో పేర్కొంది. దీనిని అందరికీ తెలిసేలా పబ్లిక్ డొమైన్‌లో పెట్టింది. ఈ కేసు జడ్జిమెంట్ కాపీ బుధవారం సీబీఐకి అందింది. దీంతో ఈ కేసును సిట్ నుంచి సీబీఐ టేకోవర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫామ్‌హౌస్ ఎఫ్‌ఐర్ ప్రకారమే సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్టు సమాచారం.
ఈడీ దర్యాప్తునకు స్టేకు నిరాకరణ..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రోహిత్‌రెడ్డి అభ్యర్థనను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈనెల 30న హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై జోక్యం చేసుకోవడానికి కోర్టు నిరాకరించింది. ఈడీ కేసు కొట్టివేయాలన్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.

వందకోట్లు ఆఫర్
ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ విచారణ చేపట్టారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తరఫున వైసీపీ ఎంపీ, సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పార్టీ మారాలని రోహిత్‌రెడ్డికి రూ.వంద కోట్లు ఆఫర్ ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆఫర్ మాత్రమే చేశారు కానీ డబ్బు ఇవ్వలేదన్న వాదనలు వినిపించారు. ఆర్థిక లావాదేవీలు జరగలేదు కనుక ఈడీకి విచారణ పరిధి లేదన్నారు. ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమని వాదించారు. వ్యక్తిగత వివరాల కోసం ఈడీ తనను వేధిస్తోందన్న రోహిత్‌రెడ్డి అన్నారు. వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.