Tomato Prices Increase: మొన్నటి వరకు పెట్రోల్, డీజిల్ ధరతో పోటీపడుతూ పెరిగిన టమాటా ధర.. ఇప్పుడు వాటిని మించిపోయింది. ఏకంగా డబుల్ సెంచరీ నమోదు చేసింది. రూ.100, రూ.120 ధరకే టమాటా కొనడమే మానేసిన పేద, మధ్య తరగతికి ఇది షాకింగ్ వార్తే. కానీ, ప్రకృతి వైపరిత్యాలు, భారీ వర్షాల కారణంగా పంటలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఉన్న పంటల దిగుబడి తగ్గుతోంది. డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ధర పెరుగుతూ పోతోంది. రైతులను కోటీశ్వరులను చేస్తున్న ఈ టమాటా.. పేద, మధ్య తరగతి వారికి మాత్రం దూరమవుతోంది. తాజాగా మదనపల్లి మార్కెట్‌లో కిలో టమాటా ధర శనివారం రూ.200 పలికింది. హోల్‌సేల్‌గానే రూ.200 ఉంటే.. రిటైల్‌గా రూ.250 వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో టమాట ధరలు దిగొచ్చే పరిస్థితి కనిపించట్లేదు.
టమాటా కేరాఫ్ మదనపల్లి..
టమాటా మార్కెట్‌కు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి కేరాఫ్‌గా చెబుతారు. ఈ మార్కెట్‌లో టమాట ధరలు రికార్డుల మీద రికార్డ్ సృష్టిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం మదనపల్లి మార్కెట్‌లో హోల్‌సేల్ ధర రూ.140 పలికింది. మరుసటి రోజు రూ.168కి చేరింది. తాజాగా మదనపల్లి మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.200 కి చేరుకుంది.
మెట్రోపనాలిటన్ నగరాలు, ఉత్తరాదికి ఎగుమతి..
మదనపల్లి మార్కెట్‌కు ప్రస్తుతం వస్తున్న టమాటా ఫస్ట్‌గ్రేడ్ టమాటా. దీనిని మెట్రోపాలిటన్ నగరాలు, ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ టమాటలు కొనేందుకు వ్యాపారులు పెద్దఎత్తున మార్కెట్‌కు తరలిరావడంతో టమాటా ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా కిలో ధర రూ.200 పలకడం విశేషం. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇతర రాష్ట్రాల్లో టమాటాకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఒక్కసారిగా ధర పెరిగింది.
రిటైల్ ధర రూ.300
హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.200 పలుకుతున్న టమాటాలు.. రిటైల్ మార్కెట్‌లో రూ.300 వరకు అమ్ముతారని అంచనా వేస్తున్నారు. దీంతో టమాటా సామాన్యుడికి మరింత దూరం అవుతోందని పేర్కొంటున్నారు.
మూడో గ్రేడ్ టమాటా రూ.150..
ఇక లోకల్‌గా అమ్మే మూడో గ్రేడ్ వెరైటీ టమాటాల ధరలు కూడా రూ.100 నుంచి భారీగా పెరిగాయి. ప్రస్తుతం రీటైల్ మార్కెట్‌లో ఈ రకం టమాటా కిలో రూ.120 నుంచి రూ.150 మధ్య ఉంది. దీంతో టమాటా ధరలు ఇప్పట్లో దిగి రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్టు చివరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు.
రెండు నెలలుగా సామాన్యులకు భారం..
గత రెండు నెలలుగా టమాటాు సామాన్యులకు భారమైన సంగతి తెలిసిందే. మేలో కిలో టమాట రూ.30 ఉండేది. జూన్, జూలైలో ధరలు భారీగా పెరిగాయి. ఒక్కసారిగా టమాటాధరలు రీటైల్ మార్కెట్‌లో రూ.200 కి చేరుకున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.