Rana and Suresh Babu : ఇటీవల నాంపల్లి కోర్ట్ సురేష్ బాబు, రానా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి సురేష్ బాబు, రానా ఒక ల్యాండ్ విషయంలో అగ్రిమెంట్ బ్రేక్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు ల్యాండ్ వివాదం ఏమిటో రానా కుటుంబంపై ఫిర్యాదు చేసిన వ్యక్తుల్లో ఒకరు మీడియాకు కూలంకషంగా వివరించారు.
ఫిల్మ్ నగర్లో హీరో వెంకటేష్, సురేష్ బాబులకు చెరో వెయ్యి గజాలు(సుమారు) ల్యాండ్ ఉంది. ఆ ప్రాపర్టీని 2014లో లీజుకు తీసుకోవడం జరిగింది. అక్కడున్న పాత బిల్డింగ్ డెవలప్ చేసి రెస్టారెంట్ స్టార్ట్ చేశారము. లీజు అగ్రిమెంట్ ముగియక ముందే సురేష్ బాబు ఆ ప్రాపర్టీ అమ్మకానికి పెట్టారు. అదేంటని అడిగితే నేను అమ్మేస్తా కావాలంటే మీరే తీసుకోండని అన్నారు. రెస్టారెంట్ మీద చాలా ఇన్వెస్ట్ చేశాము, ఇప్పటికిప్పుడు ప్రాపర్టీ కొనడమంటే కష్టం అవుతుందన్నాము.
సురేష్ బాబు మాత్రం నేను ఆ స్థలం అమ్మేస్తాను అన్నారు. చేసేది లేక ప్రాపర్టీ కొనేందుకు ముందుకు వచ్చాము. గజం రేటు లక్ష పదివేల రూపాయలతో మొదలుపెట్టి పెంచుకుంటూ పోయాడు. అనుకున్న రేటు ప్రకారం అడ్వాన్స్ ఇవ్వబోతే మరలా రేటు పెంచేసేవారు. అలా గజం రెండు లక్షల వరకు పెంచారు. అనుకున్న రేటు కాకుండా ప్రతిసారి ఇలా పెంచడం సబబు కాదు, మాకు ఇబ్బంది అవుతుందని చెబితే, నా స్థలం నా ఇష్టం. నాకు నచ్చిన రేటుకు అమ్ముకుంటానని అనేవారు.
పెద్దలను కూర్చోబెట్టి లక్షా ఎనభై వేలకు అగ్రిమెంట్ చేసుకున్నాము. మొదట సురేష్ బాబు ప్రాపర్టీతో పాటు వెంకటేష్ ప్రాపర్టీ కూడా కలిపి అమ్మేస్తాం అన్నారు. తీరా మొత్తం డబ్బులు కట్టి అగ్రిమెంట్ చేసుకోబోయే ముందు కేవలం నా ప్రాపర్టీనే అమ్ముతాను. వెంకటేష్ ప్రాపర్టీ అమ్మను అన్నారు. రెండు ప్రాపర్టీలు అమ్ముతారని అనుకున్నాం. మీరు వేరే వాళ్లకు ఆ ప్రాపర్టీ అమ్మితే మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అమ్మాలనుకున్నప్పుడు మాకు మాత్రమే ఇచ్చేలా అగ్రిమెంట్ చేయించుకున్నాము.
అప్పుడు అగ్రిమెంట్ కి ఒప్పుకొని అధిక ధర ఇస్తున్నారని వేరే వాళ్లకు అమ్మేస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది మాతో చేసుకున్న అగ్రిమెంట్ బ్రేక్ చేయడమే అవుతుంది. ఇది తప్పని అడిగితే సురేష్ బాబు, రానా బెదిరింపులకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోడంతో అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగిందని … వారు చెప్పుకొచ్చారు. దీంతో ఫిల్మ్ నగర్ ల్యాండ్ వివాదం పై స్పష్టత వచ్చింది.