New Year 2025: ప్రతీ సారి ఎన్నో ఆశలు, ఆశయాలు, కొత్త కొత్త ఆలోచనలతో కొత్త సంవత్సరం (క్యాలెండర్) లోకి అడుగుపెడతాం. ముఖ్యంగా యువత ప్రతీ ఏడాది ఒక రెజల్యేషన్ తీసుకుంటుంది. వారి వారి అలవాట్లు, అభిరుచులకు తగ్గట్టు ఇవి ఉంటాయి. అయితే వీటిని ఏ మేరకు పాటిస్తుందో తెలియదు గానీ తీసుకోవడం మాత్రం గ్యారంటీ. ఎంతలా అంటే ప్రతీ ఒక్కరూ ప్రతీ జనవరి 1వ తేదీ నుంచి దీన్ని తీసుకుంటారు. అది చిన్న చిన్న పనుల విషయంలో కావచ్చు.. పెద్ద పెద్ద పనుల విషయంలో కావచ్చు.. కానీ తీసుకోవడం మాత్రం గ్యారెంటీ. గతంలో ఒక టీవీలో ఇంటర్వ్యూలో వచ్చిన ఆ క్లిప్ ప్రతీ ఏటా డిసెంబర్ నెలలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఒక వృద్ధుడు యాంకర్ ముందు మాట్లాడుతూ.. ‘జనవరి 1 నుంచి మందు మొత్తం మానేస్తున్నాను.. కానీ 31వ తేదీ రాత్రి మాత్రం ఫుల్లుగా తాగుతాను’ అని ఈ ఇంటర్వ్యూ వచ్చి నెలలు గడిచినా.. ఇప్పటికీ ఇది రీల్స్ రూపంలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇందులోని వృద్ధుడి విధంగానే ప్రతీ సంవత్సరం ఇలాంటి రెజల్యేషన్ పాస్ చేసి కొన్ని రోజులు పాటించి ఆ తర్వాత వదిలేస్తారు.
గత సంవత్సరం ఎన్నో మధుర స్మృతులు.., చేదు ఘట్టాలు.., బాధలు.., సంతోషాలు.. ఇలా చాలా వాటిని గుర్తు చేసుకుంటూ వదిలేస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతారు. క్యాలెండర్ మారిందంటే చాలు ఇక ఈ పని చేయాలి.. ఆ పని చేయాలి.. అంటూ ఒక శపథం తీసుకుంటారు. కొంత ఏజ్ దాటిన వారు దీన్ని ఎక్కువగా పాటించకపోవచ్చు. కానీ యువత మాత్రం దీన్ని ప్రతీ ఏడాది పాటిస్తూనే ఉంటారు. క్యాలెండర్ ఇయర్ మారగానే ఇది చేయాలి.. అది చేయద్దు.. ఆ అలవాట్లను కట్ చేయాలి.. కొత్తగా ఈ మంచి అలవాట్లను తీసుకోవాలి లాంటివి చేస్తుంటారు. ఇలా ఈ సారి యువత ఒక కొత్త శపథం తీసుకున్నారట. దీంతో ఒక బిజినెస్ మార్కెట్ లో అమాంతం పెరిగిపోయిందట అదేంటంటే..
డిసెంబర్ 31వ తేదీ మద్యం కోసం వైన్ షాపుల ఎదుట క్యూలు కట్టిన యువత జనవరి 1వ తేదీ జిమ్ సెంటర్లలో కనిపించారట. దీంతో జిమ్ సెంటర్లు కిక్కిరిసాయి. క్షణం తీరిక లేకుండా ఇటూ అటూ తిరుగుతూ యువత సందడి చేశారు. యువత ఇంట్రస్ట్ ను చూసిన నిర్వాహకులు సొమ్ము చేసుకున్నారు. ఒక్క రోజులోనే అమాంతంగా ఫీజును పెంచారు. పైగా ఏడాది ఫీజు కడితే భారీ డిస్కౌంట్స్ ఇస్తామని ప్రకటించారు కూడా. దీంతో యువత ఇయర్ ప్లాన్ వైపునకే ఎక్కువగా శ్రద్ధ చూపారట. ఆరోగ్యం బాగు పడేందుకు కష్టపడడం మంచిదే కానీ ఇది కంటిన్యూగా ఉంటే బాగుంటుంది. ఏదో ఈ రోజు తీసుకొని రెండు రోజులు చేసి తర్వాత బంద్ చేస్తే మంచిది కాదని జిమ్ నిర్వాహకులు చెప్తున్నారు.