KCR- RK: కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించలేడా? కేవలం తెలంగాణలో గెలిచేందుకు మాత్రమే జాతీయ పార్టీ పెట్టాడా? ఉత్తర తెలంగాణలో 60 శాతం మంది ప్రజలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారా? తెలంగాణ భారత రాష్ట్ర సమితికి డెడ్ ఎండ్ పాయింట్ కాబోతోందా? ఈ ప్రశ్నలు అన్నింటికీ అవును అని చెబుతున్నాడు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ. ఈ ఆదివారం అతడు తన కొత్త పలుకులో ఇవే విషయాలను రాసుకుంటూ వచ్చాడు.. కెసిఆర్ కు తనకు మిత్రుత్వం ఉండడంతో ఉత్తర తెలంగాణలో పరిస్థితిని చక్కదిద్దుకోవాలని సలహా కూడా ఇచ్చాడు.

నక్క తోక తొక్కినట్టే
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నాయకుల లేమితో సతమతమవుతోంది.. అందులో కొత్తగా చేరితే భవిష్యత్తు ఏమిటనే బెంగ అందరికీ పట్టుకుంది.. అందుకే చేరికలు సులభంగా సాగడం లేదు.. ఇక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జోరుగా కొనసాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కనుక ఎన్నికల నాటికి ఇదే తీరుగా ఉంటే కెసిఆర్ నక్కతోక తొక్కినట్టే అని అంటున్నాడు ఆర్కే.. అంతేకాకుండా ఆ రెండు పార్టీల్లో తన కోవర్టులు ఇచ్చే సమాచారం ఆధారంగానే తాను అడుగులు వేస్తున్నాడని ఆర్కే తేల్చి చెప్పాడు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో గెలవాలి అంటే కచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ చేయాలని, భారత రాష్ట్ర సమితి పేరు మార్పే అందుకు నిదర్శనమని ఆర్కే కుండబద్దలు కొట్టాడు.
జాతీయ రాజకీయాల్లో అంత సీన్ లేదు
ప్రస్తుతం దేశంలో మోడీ హవా కొనసాగుతోంది. రాహుల్ గాంధీ జోడో పేరుతో యాత్ర నిర్వహిస్తున్నప్పటికీ అనుకున్నంత ఫాయిదా దక్కడం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీని కీలక నాయకులు వీడిపోతున్నారు.. ఇక జాతీయస్థాయిలో నితీష్ కుమార్, మమతా బెనర్జీ, ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. ఫలితంగా ప్రతిపక్షాల్లో ఐక్యత లేకుండా పోయింది.. మరోవైపు మొన్నటిదాకా నితీష్ కుమార్ మా ఫోల్డ్ లోనే ఉన్నాడు అని చెప్పిన కేసీఆర్… ఖమ్మం సభకు ఆహ్వానిస్తే నితీష్ కుమార్ హాజరు కాలేదు.. దీనిని బట్టి కేసీఆర్ జాతీయ అడుగులు ఆదిలోనే తడబడ్డాయి.. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, రాజా, భగవంత్ వంటి వారు జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపలేరని ఆర్కే తేల్చపడేశాడు.. కెసిఆర్ కు జాతీయ నాయకులు అంత ఈజీగా స్వాగతం పలకరని కుండబద్దలు కొట్టేశాడు.

మొన్న ఢిల్లీలో జాతీయ పార్టీ కార్యాలయం ప్రారంభించినప్పుడు ఇతర పార్టీల నేతలు హాజరు కాకపోవడమే దీనికి నిదర్శనమని ఆర్కే వివరంగా చెప్పాడు.. ఈసారి చంద్రబాబు పల్లకి ఎత్తలేదు కాబట్టి ఆర్కే కొత్త పలుకు వ్యాసం వాస్తవాలకు దగ్గరగా వెళ్ళింది.. ఆఫ్ కోర్స్ తెలంగాణలో జరిగే రాజకీయ పరిణామాలపై సూటిగా మాట్లాడగలిగే ఆర్కే… ఏపీ విషయానికి వచ్చేసరికి చంద్రబాబును జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తాడు.. అందుకే కదా ఎల్లో మీడియా అనేది. అయితే ఈ వ్యాసంలో లోపాలు ఎత్తిచూపిన నేపథ్యంలో ఆర్కే సూచనలను కెసిఆర్ పాటిస్తాడో లేదో వేచి చూడాలి.