Sethusamudram Project: ఉప్పు నిప్పుగా ఉన్న డీఎంకే, బిజెపి కలిసిపోయాయి.. రాష్ట్రం ప్రయోజనం విషయంలో ఉమ్మడిగా ముందుకు కదిలాయి.. అభివృద్ధిలో తామంతా ఒకటేనని నిరూపించాయి. రామసేతు ప్రాంతంలో సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. ఈ పరిణామాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి..భారత్, శ్రీలంక మధ్య రామసేతు ప్రాంతంలో సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మించాలంటూ తమిళనాడు ప్రభుత్వం తీర్మానించింది. దీనికి ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు తెలిపింది. దీంతో వందల సంవత్సరాలుగా నిలిచిపోయిన ప్రాజెక్టు నిర్మాణంపై మరోసారి ఆశలు చిగురించాయి. సుదీర్ఘంగా నిర్మాణానికి నోచుకోని సేతుసముద్రం ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది . చాలాకాలంగా ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న భారతీయ జనతా పార్టీ అధికార డీఎం కేకు మద్దతు పలికింది. రామసేతుకు నష్టం వాటిల్లకుండా ప్రాజెక్టు నిర్మించాలని షరతు విధించింది.. దీనికి సంబంధించి గురువారం అసెంబ్లీ లో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రవేశపెట్టగా… ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీతో పాటు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణంలో కొనసాగుతున్న జాప్యం వల్ల తమిళనాడు, దేశ అభివృద్ధికి అవరోధంగా మారుతోంది. అందువల్ల నిలిచిపోయిన ప్రాజెక్టు పనులను కొనసాగించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని తమిళనాడు అసెంబ్లీ తీర్మానించింది.. అయితే ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ భారత్, శ్రీలంక మధ్య రామసేతు ఉందని చెప్పడం కష్టమని వ్యాఖ్యలు చేసిన అనంతరం తమిళ నాడు ప్రభుత్వం ఈ తీర్మానం తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏమిటీ రామసేతు చరిత్ర?
భారత్, శ్రీలంక మధ్య ఉన్న సముద్రంలో సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మించాల్సి ఉంటుంది.. భారత్ తూర్పు, పశ్చిమ తీరాల మధ్య ప్రయాణించాలంటే ప్రస్తుతం శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తున్నది. అలా కాకుండా నౌకలు ప్రయాణించేందుకు వీలుగా చిన్నపాటి మార్పులు చేస్తే అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లకుండా కేవలం భారత జలాల ద్వారానే రవాణా చేసుకునే వీలుంటుంది.. ఆర్థికంగా అటు తమిళనాడుకు, ఇటు భారత్ కు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, నౌకల రవాణాకు అనుకూలంగా మార్చాలంటే పురాతన రామసేతు మార్గంలో కొంత భాగాన్ని తవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి బంధకంగా మారింది. గతంలో చాలాసార్లు ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు పడినా, మతపరంగా సున్నిత అంశం కావడంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గిపోయాయి.
1860 లో..
సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మించాలని 1860లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది.. దీని ద్వారా భారత్ లోని తూర్పు, పశ్చిమ తీరాలను అనుసంధానం చేయాలని సంకల్పించింది.. అయితే, కామసేతు హిందువులకు సంబంధించిన స్థలమని, దానిని కూల్చేందుకు వీలులేదని కొన్ని మత సంఘాలు ఆందోళనలు చేశాయి.. దీంతో అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది..
ప్రతిష్టాత్మకంగా తీసుకుంది
సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణాన్ని డీఎంకే పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై, ఆ తర్వాత కరుణానిధి, తాజా ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ప్రాజెక్టు నిర్మించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.. అప్పట్లో ఈ ప్రాజెక్టు నిర్మించాలని అటల్ బిహారి వాజ్ పేయి హయాంలో మరోసారి తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేసింది.. దీనికి అప్పట్లో కేంద్రం కూడా అంగీకరించింది.. కానీ ప్రభుత్వం మారిపోవడంతో ముందడుగు పడలేదు.. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ₹2,400 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఆందోళనలు చెలరేగడంతో ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలని 2007లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

జితేంద్ర సింగ్ వ్యాఖ్యలతో..
సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యలతో మళ్ళీ ఆశలు చిగురించాయి. స్పేస్ టెక్నాలజీ ద్వారా సేతు సముద్రం ప్రాంతంలో కొన్ని ద్వీపాలు, సున్నపు రాయి వంటివి కనిపించాయని, అయితే వాటి ఆధారంగా అక్కడ రామసేతు నిర్మాణం జరిగిందని చెప్పడం కష్టమేనని పార్లమెంట్ లో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తీర్మానం, దానికి భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇవ్వడం తో ప్రాజెక్టు నిర్మాణం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి అనడానికి ఊతమిస్తున్నది.