Pawan Kalyan: రణస్థలం వేదికగా జనసైనికులకు రాజకీయ దిశానిర్దేశం చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో పొత్తుల అవసరాన్ని అర్థమయ్యేలా వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం సర్దుకుపోవాల్సిన అవసరం ఉందంటూ తేల్చి చెప్పారు. ఒంటరిగా వెళితే శత్రువుకి బలం చేకూరుతుందని, ఉమ్మడిగా వెళ్తే శత్రువుని దెబ్బకొట్టగలమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జనసేనాని వీరమరణం అనే పదాన్ని వాడారు. ఇప్పుడు ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.

శ్రీకాకుళం జిల్లా రణస్థలం యువశక్తి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా మాట్లాడారు. భవిష్యత్ ప్రయాణం పై జనసైనికులకు స్పష్టతనిచ్చారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగనివ్వకూడదని సూచించారు. 2019లో ఒంటరిగా పోటీ చేయడం కారణంగా 50కి పైగా స్థానాల్లో వైసీపీ గెలుపుకు పరోక్షంగా కారణమయ్యామని చెప్పారు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వనని చెప్పినట్టు గుర్తు చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే ప్రతిపక్షాలను కలుపుకుపోతున్నట్టు చెప్పారు. ప్రతిపక్షాల అనైక్యతే అధికార పార్టీ బలమని, అనైక్యతను అధిగమిస్తే విజయం మనదే అంటూ తేల్చి చెప్పారు.
ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి వీరమరణం పొందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పొత్తులు లేకుండా వెళ్లే ధీమా, ధైర్యం ఇవ్వగలరా ? అంటూ జనసైనికుల్ని అడిగారు. జనసైనికులు ఆ ధీమా ఇవ్వగలిగితే పొత్తులు లేకుండా వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. ఒకవేళ పొత్తులు ఉన్నా సరే గౌరవప్రదంగా ఉండాలంటూ టీడీపీకి హింట్ ఇచ్చారు. ప్రజాస్వామిక యుద్ధంలో ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందాల్సిన అవసరం లేదని, కలిసొచ్చే శక్తులతో శత్రువు పై పోరాడవచ్చనేది జనసేనాని అభిప్రాయంగా కనిపిస్తోంది.

పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో పార్టీల పొత్తులు సహజం. కలిసొచ్చే పార్టీలతో ఎన్నికలకు వెళ్లడం అనాదిగా జరుగుతోంది. ప్రజాస్వామిక ప్రక్రియను పునరుద్దరించే క్రమంలో మిత్రపక్షాలతో కలిసి పోరాడటం తప్పు కాదని పవన్ భావిస్తున్నారు. ఒంటరిగా వెళ్లి అధికార పార్టీకి బలం చేకూర్చే బదులుగా ప్రతిపక్షాలను కలుపుకొని ఎన్నికల పోరాటం చేయడం మంచిదని భావిస్తున్నారు.