Llama Poop: జీవ వైవిధ్యానికి మూలం జంతుజాలం. ఇది అందరికీ తెలుసు. భూమండలానికి ప్రకృతి ప్రసాదించిన వరం వృక్ష, జంతుజాలం. జీవకోటి మనుగడ సాధిస్తుంది అంటే.. జీవ వైవిధ్యమే కారణం. వృక్షాలు అంతరించిపోయినా.. జంతుజాలం కనుమరుగైనా జీవవైవిధ్యం దెబ్బతింటుంది. పర్యావరణ సమతుల్యం లోపిస్తుంది. భూతాపం పెరుగుతుంది. అయితే ఈ విషయం తెలిసినా చాలా మంది ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతూనే ఉంటున్నారు. నగరాలు కాంక్రీటు జంగిల్‌లా మార్చేస్తున్నారు. విపరీతమైన ప్లాస్టిక్ వినియోగం కాలుష్యాన్ని, భూతాపాన్ని పెంచుతున్నాయి. మనిషి ఇంత చేస్తున్నా.. ఆ జంతువు మాత్రం తనకు తెలియకుండానే భూమిని కాపాడుతోంది. అదే లేకుంటే ఈ భూమండలం ఏమయ్యోదో అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటీవల జరిపిన పరిశోధనల్లో ఈ వాస్తవాలను వెల్లడించారు. ఇంతకీ ఆ జంతువు ఏంటి.. ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
ఒంటెజాతి లామా..
ఒంటె జాతికి చెందిన లామాల పేడ(లామా బీన్) ప్రపంచాన్ని రక్షిస్తుందని తాజా అధ్యయనం. ఈ పేడ మట్టికి పోషకాలను అందించగలదని.. మొక్కలు వృద్ధి చెందేందుకు అవసరమైన పోషణను తిరిగి తీసుకురాగలదని పరిశోధనల్లో తేలింది. కార్డిల్లెరా బ్లాంకాలో లామాలను పెంచుతున్న రైతులతో కలిసి మూడేళ్లపాటు వీటిని పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం.. హిమానీనదాల ద్వారా బంజరుగా మారిన అండీస్‌లోని ఒక భాగంలో వీటిని పెంచడం వల్ల నేలకు పోషకాలను అందించగలిగినట్లు తెలిపారు.
పీర్–రివ్యూడ్ జర్నల్‌లో సైంటిఫిక్ రిపోర్ట్స్..
పీర్ – రివ్యూడ్ జర్నల్‌లో ప్రచురించబడిన సైంటిఫిక్ రిపోర్ట్స్ ప్రకారం.. లామాలను పెంచే ప్రాంతాలలో నేల పోషకాలు పెరిగాయి. నాలుగు కొత్త మొక్క జాతులతో సహా ప్లాంట్స్ కవరేజ్ 57 శాతం పెరిగింది. ఈ ప్రాంతంలో లామాలు పెరగడం, తిరగడం, విసర్జన చేయడం వల్లనే ఇది సంభవించింది. నిజానికి లామా బీన్‌లో ఉంటే కార్బన్, నైట్రోజన్ వంటి పోషకాలు.. మట్టికి తిరిగి జీవాన్ని అందిస్తాయని శాస్త్రీయంగా నిరూపించడం ఇదే తొలిసారి.
హిమనీ నదాల పరిసరాల్లో..
హిమానీనదాలు కరిగినప్పుడు, దాని కింద చిక్కుకున్న నేల పోషకాలు లేకుండా ఉంటుంది. సొంతంగా నేల సారవంతం కావడానికి వందల సంవత్సరాలు పట్టవచ్చు. అయితే ఈ ఏరియాల్లో లామాల పెంపకం గ్లోబల్ వార్మింగ్‌ను అరికడుతుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగలదని తెలిపారు శాస్త్రవేత్తలు. ఈ లామాలే అక్కడ లేకపోయి ఉంటే.. హిమనీ నదాల తీరం ఇప్పటికే ఎడారిగా మారిపోయేదనిఇ తెలిపారు. కేవలం లామాల పేడ కారణంగానే అక్కడ పర్యావరణ సమతుల్యం రక్షించబడుతుందని పేర్కొన్నారు.