ITT Madras BharOS: ఇండియా ఆత్మనిర్భర భారత్ దిశగా అడుగులేస్తోంది. ద్విముఖ పోటీ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ తయారీలోకి అడుగుపెడుతోంది. భారతీయులకు స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ఆపిల్, గూగుల్ దే అగ్రస్థానం. ఇక నుంచి భారత్ కూడ పోటీ పడబోతోంది.

ఆపిల్ ఐవోఎస్, గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్.. ఇప్పటి వరకు ప్రపంచం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ రెండు కంపెనీలు ఓఎస్ మార్కెట్ లో తిరుగులేని శక్తిని సంపాదించుకున్నాయి. మిగిలిన కంపెనీల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ.. మార్కెట్లో వాటి షేర్ చాలా తక్కువ. భారత్ లాంటి దేశాల్లో వందల కోట్ల ఫోన్లు ఉపయోగిస్తున్నారు. వాటిల్లో ఆపిల్, గూగుల్ ఓఎస్ వాడుతున్నారు. ఇలా విదేశీ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడటం వల్ల డేటా భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి సంఘటనలు అరకొర చోటుచేసుకున్నాయి. భారత ప్రభుత్వం వాటి పై చర్యలు తీసుకుంది.
డేటా భద్రత భారత ప్రభుత్వ ప్రథమ లక్ష్యం. ఇందులో భాగంగా ఆపరేటింగ్ సిస్టమ్ తయారీని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో జాన్ డీకే అనే కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్ ను రూపొందించింది. దీనికి సంబంధించి 2022 మార్చిలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. భారత్ సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేస్తోందని అన్నారు. అయితే సాఫ్ట్వేర్ ఎగుమతి, వెలుపల వినియోగం పై నిషేధం విధించలేదని తెలిపారు. ఈ ఓఎస్ పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందినది. ఇది అందుబాటులోకి వస్తే భారతీయులు సొంత ఓఎస్ వినియోగించవచ్చు.

సొంత ఆపరేటింగ్ సిస్టమ్ వాడటం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. డేటా భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదు. అదే సమయంలో అనవసరమైన యాప్స్ బలవంతంగా వాడాల్సిన అవసరం లేదు. అవసరమైన యాప్స్ మాత్రమే వాడవచ్చు. స్వదేశీ ఓఎస్ అందుబాటులోకి వస్తే గూగుల్, ఐఫోన్ ఏకఛత్రాధిపత్యానికి గండిపడనుంది. ఆత్మనిర్భర భారత్ లక్ష్యం నెరవేరనుంది.