Homeట్రెండింగ్ న్యూస్Snake Venom: ఆ పాము విషం ఖరీదు రూ.13 కోట్లు... ఎందుకు అంత విలువో తెలుసా?

Snake Venom: ఆ పాము విషం ఖరీదు రూ.13 కోట్లు… ఎందుకు అంత విలువో తెలుసా?

Snake Venom: పాము పేరు వినగానే మనలో తెలియని భయం కలుగుతుంది.. ఇక పాము ప్రత్యక్షంగా కనిపిస్తే హడలిపోతాం. కానీ కొంత మంది పామును పట్టుకుని దాని నుంచి విషయం తీసి విక్రయిస్తున్నారు. పాము విషంతో ఏం చేస్తారు.. దాని విలువ ఎంత ఉంటుంది అన్న సందేహాలు కలుగుతాయి. కానీ ఇక్కడో పాము విషం విలువ ఏకంగా రూ.13 కోట్లు. అంత ఖరీదైన ఆ విషాన్ని ఇద్దరు స్మగ్లర్లు బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు అక్రమంగా రవాణా చేస్తుండగా బీఎస్‌ఎఫ్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

స్మగ్లింగ్‌ సమాచారంతో..
కొంతమంది స్మగ్లర్లు బంగాదేశ్‌ నుంచి భారత్‌లోకి వస్తున్నట్లు సరిహద్దు బలగాలకు ఆదివారం సమాచారం అందింది. అప్రమత్తమైన భద్రతా దళాలు.. భారత్‌–బంగ్లాదేశ్‌ సరిహద్దులోని పశ్చిమ బెంగాల్‌లోని హిలీ ప్రాంతం వద్ద పహన్‌పరా గ్రామంలో.. కాపు కాశారు. అర్ధరాత్రి దాటిన తరువాత.. సుమారు 12:30 గంటల ప్రాంతంలో ఇద్దరు స్మగ్లర్లు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా దళాలు కాల్పులు జరపడంతో ఆ స్మగ్లర్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు. తర్వాత అక్కడ తనిఖీలు చేయగా, ఆ ప్రాంతాల్లో స్మగ్లర్లు జారవిడిచిన ఓ సీసా దొరికింది. దాంట్లో పాము విషం ఉండటాన్ని గుర్తించారు. సీసాపై మేడ్‌ ఇన్‌ ఫ్రాన్స్‌ అని రాసి ఉందని వారు తెలిపారు. బాటిల్‌లో ఉన్న విషం కోబ్రా పాముదని భద్రతా దళాలు తెలిపాయి. ఆ బాటిల్‌ను అటవీ అధికారులకు అందించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ విషం విలువ కనీసం రూ.13 కోట్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌..
అంతర్జాతీయ మార్కెట్‌లో పాము విషానికి ఎక్కడలేని డిమాండ్‌ ఉంది. చైనా సంప్రదాయ ఔషధాల్లో ఖడ్గమృగం, ఎలుగుబంటి, పులి లాంటి 36 జంతువుల నుంచి సేకరించిన వాటిని వాడతారు. పాము కాటుకు విరుగుడుగా ఉపయోగపడే యాంటీ వీనమ్‌ను తయారీకి కూడా పాము విషమే అవసరం అవుతుంది. అందుకే అటవీ ప్రాంతాల్లో నాగుపాము విషం 10 గ్రాములకు రూ.4 వేలు చెల్లిస్తున్నారు.

గతంలోనూ పలుమార్లు..
బంగ్లా సరిహద్దుల్లో అక్రమంగా దేశంలోకి పాము విషాన్ని తరలిస్తూ పట్టుబడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో బెంగాల్‌ సరిహద్దుల్లో ఏకంగా రూ.57 కోట్ల విలువైన పాము విషాన్ని బీఎస్‌ఎఫ్‌ దళాలు పట్టుకున్నాయి. 2021, సెప్టెంబరులో దక్షిణ దినాజ్‌పూర్‌లోని డోంగి గ్రామం వద్ద 56 ఔన్సుల విషంతో ఉన్న సీసాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సీసాపై కూడా ‘మేడిన్‌ ఇన్‌ ఫ్రాన్స్‌.. కోడ్‌ నెం. 6097’ అని రాసి ఉంది. అలాగే, ఉత్తర దినాజ్‌పూర్‌లోనూ గతేడాది సెప్టెంబరులో రూ.30 కోట్ల ఖరీదైన రెండు కిలోల పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు.

చైనాకు అక్రమ రవాణా..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పాముల విషాన్ని ఫ్రాన్స్‌ నుంచి బంగ్లాకు తీసుకొచ్చి.. అక్కడ నుంచి నేపాల్, భారత్‌ మీదుగా చైనాకు తరలించడమే స్మగ్లర్ల ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. సంప్రదాయ ఔషధాల తయారీకి చైనీయులు పాము విషాన్ని వినియోగిస్తుంటారు. పాముల విషం నుంచి ప్రాణాంతకమైన వ్యాధులకు మందులు కనిపెట్టడం ప్రాచీనకాలం నుంచి ఉంది. ఆయుర్వేద విధానంలో కీళ్ల నొప్పులకు పాము విషంతో తయారైన ఔషధాలు వాడతారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version