Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్ పోటీల్లో డిస్ క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం నుంచి అటు ప్రధాన మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లో లక్షలాదిమంది వినేశ్ ఫొగాట్ పై సానుభూతి వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ దాకా వెళ్ళింది. ఒలింపిక్ హిస్టరీలో తుది పోరుకు చేరుకున్న తొలి మహిళ రెజ్లర్ గా అరుదైన ఘనతను అందుకుంది.. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్, టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ విజేత అయిన సుసాకి (జపాన్) ను వినేశ్ ఫొగాట్ ఓడించింది. 10 సెకండ్ల వ్యవధిలో మూడు పాయింట్లు సాధించి 3-2 తేడాతో గెలుపును అందుకుంది. ఈ విజయం ద్వారా వినేశ్ ఫొగాట్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇదే ఉత్సాహంతో క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్ రెజ్లర్ లివాచ్ ను వినేశ్ ఫొగాట్ మట్టికరిపించింది.. మంగళవారం జరిగిన సెమీఫైనల్ లో క్యూబా రెజ్లర్ గుజ్మాన్ పై ఏకపక్ష విజయం సాధించింది..5-0 తేడాతో చివరి అంచెకు వెళ్లిపోయింది.. బుధవారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు వినేశ్ ఫొగాట్ ఫైనల్ మ్యాచ్ అడాల్సి ఉంది. ఫైనల్ లో హిండె బ్రాండ్ తో తలపడాల్సి ఉంది. ఫైనల్ వరకు ముందు ఆమె తన విభాగంలో నిబంధనల కంటే 100 గ్రాముల వెయిట్ ఎక్కువగా ఉందని ఒలింపిక్స్ కమిటీ డిస్ క్వాలిఫై చేసింది. దీంతో మెడల్ లేకుండా ఆమె నిరాశతో వెను తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది..
వినేశ్ ఫొగాట్ మొదటినుంచి రెజ్లింగ్లో 53 కిలోల విభాగంలో పోటీపడుతోంది. 2016లో రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్ లో ఆమె అదే కేటగిరిలో పోటీపడింది. అయితే అందులో ఆమె ఆశించినంత స్థాయిలో ఫలితాలు దక్కించుకోలేదు. మరోవైపు రెజ్లింగ్ సమాఖ్యలో చోటు చేసుకున్న పరిణామాలు నేపథ్యంలో ఆమె తన కేటగినన్ని పూర్తిగా మార్చేసుకుంది. ఒలింపిక్స్ ఎంపిక పోటీలలో యువ రెజ్లర్ పంఘల్ చేతిలో ఆమె ఓడిపోయింది. దీంతో 53 కిలోల నుంచి 50 కిలోలకు ఆమె మారిపోయింది. మంగళవారం వరుసగా మూడు మ్యాచ్లు ఆడిన ఆమె 50 కిలోల బరువు మాత్రమే ఉంది. ఈ మ్యాచ్ల సందర్భంగా తక్షణ శక్తి కోసం ఆమె ఫ్లూయిడ్స్ తీసుకుంది. ఎలక్టరో లైట్స్ డ్రింక్స్ తాగింది. ఫలితంగా రెండు కిలోల బరువు పెరిగింది. కేవలం 24 గంటల గ్యాప్ లోనే ఫైనల్ పోరు ఉండడంతో.. రాత్రి మొత్తం రెండు కిలోల బరువు తగ్గడానికి ఆమె చెమటోడ్చింది. నిద్రాహారాలు పూర్తిగా మానేసింది. స్కిప్పింగ్ చేసింది. జాగింగ్ చేసింది. అయినప్పటికీ నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో.. ఆమె ఫైనల్ మ్యాచ్ ఆడకుండానే నిష్క్రమించాల్సి వచ్చింది.. ఈ వ్యవహారంలో భారత ఒలింపిక్ కమిటీ విజ్ఞప్తి చేసినప్పటికీ పారిస్ ఒలింపిక్ కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
వినేశ్ ఫొగాట్ బరువు పెరగడం వెనక చాలా జరిగిందని… ఇందులో కుట్ర కోణం ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా ఆమె తన గళం విప్పింది. భారత రెజ్లర్లు చేపట్టిన నిరసనల్లో ఆమె అత్యంత చురుకుగా పాల్గొన్నది. ఈ క్రమంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆమెపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. నిరసనల్లో భాగంగా వినేశ్ ఫొగాట్ పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు కూడా తిన్నది. సోషల్ మీడియా వేదికగా విమర్శలు కూడా ఎదుర్కొంది. అవమానాలను భరించింది.. ఈ క్రమంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్ వెళ్లిన నేపథ్యంలో ఆమె అభిమానులు భారీగా సంబరాలు చేసుకున్నారు.. అంతేకాదు బ్రిజ్ భూషణ్ ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
వినేశ్ ఫొగాట్ వరుస విజయాలు సాధించినప్పటికీ ప్రధానమంత్రి అభినందనలు తెలపలేదు. ఇతర ఆటగాళ్లు మెడల్స్ సాధించినప్పుడు.. విజయాలు దక్కించుకున్నప్పుడు వారితో మోడీ మాట్లాడారు.. మరోవైపు బుధవారం ఆమెకు ఎదురైన అనుభవాన్ని తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. భారత ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలు పి.టి.ఉషకు ఫోన్ చేశారు.. అదే సమయంలో పలు విషయాలపై ఆమెతో చర్చించారు. ఇక వినేశ్ ఫొగాట్ డిస్ క్వాలిఫై కావాలని ఉద్దేశంతో ఎక్కువ వెయిట్ పెరిగే ఫుడ్ అందించారని సోషల్ మీడియాలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. భారత ఒలింపిక్ కమిటీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడుతున్నారు. భారత రెజ్లర్ కు సపోర్టుగా లేకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.. అధిక బరువు పెరిగిందని ఆమె గుర్తించినప్పుడు.. ఫైనల్ లో పాల్గొనకుండా ఉంటే కనీసం రజత పతకం దక్కేది కదా అంటూ గుర్తు చేస్తున్నారు. “ఒక్క క్రీడాకారిణిని లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెట్టారు.. చివరికి ఆమె డిస్ క్వాలిఫై అయింది. ఇలా చేస్తున్నారంటే మీరు కచ్చితంగా మట్టి కొట్టుకుపోతారంటూ” సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More