Chaganti Koteswara Rao : ఏపీ ప్రభుత్వం చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది.ఇప్పటికే ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు కీలక బాధ్యతలు అప్పగించింది. విద్యార్థులు- నైతిక విలువల సలహాదారు పదవిలో నియమించింది. క్యాబినెట్ హోదా సైతం కల్పించింది. ఇటీవలే ఆయన ఈ పదవి స్వీకరిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ ను కలిశారు. త్వరలోనే పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇటువంటి తరుణంలో తాజాగా మరో బాధ్యతను చాగంటి పై పెట్టింది ఏపీ ప్రభుత్వం. రెండు రోజుల కిందట జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చాగంటి కోటేశ్వరరావు తో నైతిక విలువల పెంపుదలకు సంబంధించి పుస్తకాలు రూపొందించాలని నిర్ణయించారు. ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేట్ చేస్తూనే.. విద్యార్థులకు విలువలతో కూడిన పాఠ్యప్రణాళిక రూపొందించాలని మరో నిర్ణయం కూడా తీసుకున్నారు.
* ఆ కిట్ తో ఇక కొత్త పుస్తకం
ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం పాఠ్యపుస్తకాలకు సంబంధించి కిట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కిట్టు పేరును మార్చింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం పేరుతో ఈ కిట్లు అందజేయాలని నిర్ణయించింది. రూ. 32.45 కోట్ల వ్యయంతో అందించే ఈ కిట్లలో పాఠ్యపుస్తకాలతో పాటు పోటీ పరీక్షల మెటీరియల్, రికార్డ్స్ బుక్స్,రాత పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఈ నైతిక విలువలు పెంపొందించే బుక్ ను దానికి జత చేయనున్నారు.
* స్వాగతించిన చాగంటి
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సలహాదారు పదవిని చాగంటి స్వీకరిస్తారా?లేదా?అన్న అనుమానాలు ఉండేవి. అయితే దానిని పటాపంచలు చేస్తూ పదవిని స్వీకరిస్తున్నట్లు చాగంటి తెలిపారు. పిల్లలకు ఉపయోగపడే నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ పదవిని అంగీకరించినట్లు చాగంటి చెప్పుకొచ్చారు. పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించే కీలకమైన బాధ్యతలను తనకు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. పదవుల కోసం తాను అంగీకారం తెలియజేయలేదని… తాను చెప్పే మాటలతో పిల్లలకు మేలు జరిగితే చాలు అన్నారు చాగంటి. అంతకుమించి తనకు ఆనందం ఏముంటుందని.. ఈ కారణంతోనే తాను సంతోషంగా అంగీకరించినట్లు చెప్పారు. ఇప్పుడు ఏకంగా పాఠ్య పుస్తకాల తయారీలో సైతం చాగంటికి ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించడం విశేషం.