Bus Accident: ప్రాణం తీయడం సులభం.. కానీ ప్రాణం పోయడం మన చేతిలో లేదు. సృష్టికర్త బ్రహ్మకు మాత్రమే ప్రాణం పోసే శక్తి ఉంది. కానీ, ఓ బస్సు డ్రైవర్ 45 మందికి పునర్జన్మ ప్రసాదించాడు. తనను గుండె పిండుతున్నా.. తాను సారథిగా ఉన్న బస్సును చివరి ఊపిరి వరకు కట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. చివరకు మృత్యువ అంచువరకు వెళ్లిన బస్సును ఆపి.. తాను ఆ మృత్యువుకు బలయ్యాడు. ఈ విషాద సంఘటన బస్సులోని ప్రయాణికులను కలచివేసింది. ఒక టూరిస్ట్ బస్సు కు చెందిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను కాపాడడానికి చేసిన పని అతడిని, బస్సులో ప్రయాణికుల పాలిట దేవుడిని చేసింది. బస్సులోని ప్రయాణికులు అందరినీ కంట తడి పెట్టించారు.

తాన ప్రాణం పోయినా పరవాలేదని..
ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం సుందరయ్య కాలనీ మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఒక బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఆపై డ్రైవర్ తన సీట్లోనే కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో ప్రయాణీకులకు ఎవరికీ అర్థం కాలేదు. ఎవరికీ ఎటువంటి గాయాలు లేకుండా ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ మార్గంలో ఇసుక లారీలు ఎక్కువగా వస్తున్న క్రమంలో విపరీతమైన గుండెపోటుకు గురైన బస్సు డ్రైవర్ పెను ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడి తాను ప్రాణాలు కోల్పోయాడు.
వేగంగా వెళ్తున్న బస్సు.. ఎదురుగా లారీ..
సుమారు 60 కిలోమీటర్ల వేగంతో బస్సు ప్రయాణిస్తోంది. ఈ సమయంలో డ్రైవర్ గుండె పట్టేసింది. రాబోయే ప్రమాదం ఆయన కళ్లముందు కదలాడింది. ఎదురుగా లారీ వేగంగా దూసుకొస్తోంది. కట్రోల్ చేయకపోతే తనతోపాటు 45 మంది ప్రాణాలు పోతాయని గుర్తించాడు. తాను పోయినా.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని
సంకల్పించాడు. గుండె పిండేస్తున్నా.. ఎదురుగా వస్తున్న ఇసుక లారీలను తప్పించి, బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడడానికి డ్రైవర్ తెగువ చూపాడు.
అంతా ఆంధ్రప్రదేశ్‌వారే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం ఉత్తర బ్రాహ్మణపల్లికి చెందిన 45 మంది తమిళనాడులో తీర్థయాత్రకు వెళ్లి, తిరుగు ప్రయాణంలో భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఇక భద్రాచలం నుంచి యాదాద్రికి బయలుదేరిన వారి ప్రయాణం సాఫీగా సాగుతుంది అనుకుంటే ఊహించని అవాంతరం వచ్చి పడింది.
పొదల్లోకి వెళ్ళిన బస్సు..
డ్రైవర్ ఒక్కసారిగా బస్సును పక్కనే ఉన్న పొదల్లోకి నడపడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే అసలు విషయం ఏమిటంటే తీవ్రమైన గుండెపోటుతో డ్రైవర్ బస్సులోనే కుప్పకూలిపోయాడు. తమిళనాడులోని వేలూరు జిల్లా పొన్ని గ్రామానికి చెందిన డ్రైవర్ జే. దేవాయిరక్కం అంతకుముందు గుండెలో కాస్త మంటగా ఉంది అని చెప్పి కాసేపు బస్సును ఆపాడు. ఆపై మరలా బస్సును ముందుకు పోనిచ్చిన తీవ్రంగా గుండెపోటు రాగా ఎదురుగా వస్తున్న ఇసుక లారీని తప్పించి, రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకుపోయారు. ఆపై డ్రైవర్ సీట్లోనే కుప్పకూలిపోయాడు.

కన్నీరుపెట్టిన ప్రయాణికులు
బస్సు తక్కువ స్పీడ్‌గా ఉండటం, డ్రైవర్ నొప్పిగా ఉన్నా బస్సుకు బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే బస్సు డ్రైవర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన డ్రైవర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ తనకు ఎంత నొప్పిగా ఉన్నా, సమయస్ఫూర్తితో బస్సును పక్కకు తీసి బ్రేక్ వేశాడు. లేకుంటే పెను ప్రమాదం జరిగేదని ప్రయాణికులు చెబుతున్నారు. తమ ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్ మృతి చెందడం పట్ల ప్రయాణికులు కన్నీటిపర్యంతమయ్యారు.