
British Government- BBC: భారత ఆదాయపు పన్ను శాఖ బిబిసి కార్యాలయాల్లో సోదాలు చేసిన తర్వాత.. బ్రిటన్ పార్లమెంట్ స్పందించింది. అంతేకాదు మనం “బీబీసీకి అండగా ఉండాలని” తీర్మానించింది. “మనం స్థాపించిన బిబిసి వరల్డ్ న్యూస్ ను సమర్థించాల్సి” ఉందని ప్రకటించింది. అఫ్కోర్స్ అబద్దాలను ప్రచారం చేయడంలో శతాబ్దానికి పైగా అనుభవం ఉన్న బీబీసీకి బ్రిటన్ లో సమర్ధన బాగానే ఉంది.. బ్రిటన్ పార్లమెంట్లో చర్చ సందర్భంగా ఒక అత్యవసర ప్రశ్నకు “బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు ఫారెన్ కామన్వెల్త్, డెవలప్మెంట్ ఆఫీస్ జూనియర్ మినిస్టర్” డేవిడ్ రూట్లే డొంక తిరుగుడు సమాధానం ఇచ్చాడు. భారత ఆదాయపు పన్ను శాఖ చేసిన సోదాల గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని అంటూనే వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వేచ్ఛ గురించి బీభత్సంగా మాట్లాడాడు. భారత ఆదాయపు పన్ను శాఖ సోదాల గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని డేవిడ్ అంటున్నాడు అంటే.. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించినట్టే కదా? ఒక కంపెనీ ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా కనిపించినప్పుడు సోదాలు చేసే అధికారం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఉంటుంది. ఆ సోదాల మీద వ్యాఖ్యలు చేసేందుకు బ్రిటన్ కు ఎటువంటి అధికారం లేదు.. మరి అలాంటప్పుడు ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలను, బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీకి ముడి పెట్టడం ఎందుకు?
ఓహో రోబస్ట్ డెమోక్రసీనా?
ఈ చర్చ సందర్భంగా “రోబస్ట్ డెమోక్రసీ” గురించి డేవిడ్ రూట్లే మాట్లాడాడు. ప్రపంచంలోని 3 వంతు దేశాలను ఆక్రమించి, వాటి సంపదను మొత్తం దోచుకున్న బ్రిటన్ రోబస్ట్ డెమోక్రసీ గురించి మాట్లాడటం నిజంగా విడ్డూరమే. బ్రిటన్ లాగా హౌస్ ఆఫ్ కామన్స్ లో రాణి లేదా రాజుతోపాటు 26 మంది క్రైస్తవ మత గురువులు నడపడం? ప్రజాస్వామ్యం అంటే.. దీనికి మాత్రం డేవిడ్ రూట్లే వద్ద సమాధానం ఉండదు.
ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?
చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కు చెందిన 26 మంది బిషప్ లు బ్రిటన్ పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ లో బ్రిటన్ రాణితో కలిసి దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ చేసే చట్టాలను పర్యవేక్షించడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇది ముమ్మాటికీ ఫ్యూడల్ వ్వవస్థే. ప్రజా స్వామ్యం లో మత గురువులను ఎలా నామినేట్ చేస్తారు? అలా చేస్తే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు హౌస్ ఆఫ్ కామన్స్ లో దిగువ సభ చేసే చట్టాలను ఈ మత గురువులు సమీక్షించడం ఏంటి అసలు? ఇలాంటి వ్యవస్థ భారత్లో లేదు.. అలాంటప్పుడు బ్రిటన్ భారతదేశానికి ప్రజాస్వామ్యం గురించి పాఠాలు ఎలా చెబుతుంది? ప్రజల చేత ఎన్నుకున్న ప్రతినిధులు పాలిస్తున్న దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది..అదే మత గురువులు ప్రాతినిధ్యం వహించే బ్రిటన్ లో మాత్రం ప్రజాస్వామ్యం నాలుగు పాదాల మీద నడుస్తోంది. వారేవా ఏం ముక్తాయింపు? అచ్చం ఆ రాహుల్ గాంధీ, కేసీఆర్, కేటీఆర్ లెక్కే ఉంది బ్రిటన్ వాదన కూడా..

12 భాషల్లో..
డేవిడ్ రూట్లే చెప్పిన దాని ప్రకారం బీబీసీ వరల్డ్ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.. ఈ 12 భాషల్లో నాలుగు భారతీయ భాషలు తెలుగు, మరాఠీ, గుజరాతి, పంజాబీ భాషల్లో పనిచేస్తోంది.. గుజరాత్ రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. మొన్న జరిగిన ఎన్నికలప్పుడు బిబిసి అనేక వ్యతిరేక కథనాలను ప్రసారం చేసింది. మహారాష్ట్రలో బిజెపి అధికారంలో ఉంది కాబట్టి అక్కడ వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తోంది. పంజాబ్లో ప్రభుత్వ అనుకూలంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నది.. క్రైస్తవ సంస్థలకు వత్తాసు పలికేలాగా కథనాలు ప్రసారం చేస్తోంది. అదే లెక్కన కేరళలో బీబీసీ లేదు. కర్ణాటకలో త్వరలో ఛానల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇక భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను లెక్కచేయకుండా బ్రిటన్ వాయిస్ ను వినిపించడం ఏమిటో ఆ డేవిడ్ రూట్లే వివరంగా చెప్పాలి. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.. దాన్ని సవాల్ చేస్తూ గుజరాత్ అల్లర్లకు మోడీ బాధ్యుడు అంటూ నిర్ధారించుకొని దాన్ని డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేయడమేమిటో బీబీసీ నే చెప్పాలి. ఒక దేశపు సార్వభౌమాధికారాన్ని సవాల్ చేయడం ఏమిటో బ్రిటన్ వివరించాలి.
దాన్ని సమర్ధించడం లేదు
మరో వైపు బీబీసీ డాక్యుమెంటరీ మీద బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ మాట్లాడుతూ… దాన్ని సమర్ధించడం లేదు అని వ్యాఖ్యానించాడు. ఇది జరిగిన వారం తర్వాత ఐర్లాండ్ ఎంపీ జిమ్ షానాన్ స్పందించాడు. బీబీసీ ని భారత్ అణచివేయాలని చూస్తోందని ఆరోపించాడు..ఇతడు వ్యాఖ్యలు చేసిన తర్వాతే డేవిడ్ రూట్లే స్పందించాడు. భారత్, బ్రిటన్ మధ్య 2023 రోడ్ మ్యాప్ కోసం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి దురదృష్ట సంఘటన జరగడం విచారకరం అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బ్రిటన్ దేశానికి… ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన భారతదేశ అవసరం ఉంది. మరి అలాంటప్పుడు పెన్ ఫ్రీడం పేరుతో భారత దేశంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని గట్టిగా ఎదుర్కొనే హక్కు భారత దేశానికి ఉంటుంది కదా! బిబిసి చేసిన తప్పుడు ఆరోపణలు సాక్షాత్తు భారత ప్రధాని ని ఉద్దేశించినవే. ఇలాంటప్పుడు భారత్ వాణిజ్య ఒప్పందాలు ఎలా చేసుకుంటుంది? దీనిపై బ్రిటన్ ఎందుకు గగ్గోలు పెడుతోంది.?!