Homeట్రెండింగ్ న్యూస్Hyderabad: ఆన్ లైన్ గేమ్స్.. తల్లి బ్యాంక్ ఖాతా నుంచి 36 లక్షలు ఖాళీ చేసిన...

Hyderabad: ఆన్ లైన్ గేమ్స్.. తల్లి బ్యాంక్ ఖాతా నుంచి 36 లక్షలు ఖాళీ చేసిన కొడుకు.. ట్విస్ట్ ఇదే!

Hyderabad: ఆన్‌లైన్‌ గేమ్స్‌.. సైబర్‌ మోసాలు రోజు రోజుకూ పెరుగుతున్నా చాలా మంది ఇంకా మేల్కోవడం లేదు. పిల్లలకు ఫోన్‌కు అలవాటు చేస్తున్న తల్లిదండ్రులు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు చేస్తున్నారు. పిల్లల అవసరాల కోసం ఫోన్లు కొనిస్తున్న పేరెంట్స్‌.. వారు ఏం చేస్తున్నారు.. ఏం చూస్తున్నారు.. ఏం ఆడుతున్నారు అనే విషయాలను గమనించడం లేదు. ఫలితంగా ఆర్థికంగా నష్టపోవడంతోపాటు, పిల్లలు పెడదోవ పట్టడానికి పరోక్షంగా కారణమవుతున్నారు. తాజాగా ఓ 16 ఏళ్ల కొడుకు ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతూ తన తల్లి ఖాతాలోని రూ.36 లక్షలు పోగొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

ఫ్రీ ఫైర్‌గేమ్‌ ఆడుతూ..
కేంద్రం చైనా ఆన్‌లైన్‌ గేమ్‌లను నిషేధించిన తర్వాత మోసాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల చైనాలో 13 ఏళ్ల బాలిక మొబైల్‌ గేమ్‌ కోసం రూ.52 లక్షలు వెచ్చించి తన తల్లి బ్యాంకు ఖాతాను ఖాళీ చేసింది. ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన మరో మైనర్‌ ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడటం కోసం ఇలాంటి పని చేశాడు. అంబర్‌పేట ఏరియాకు చెందిన 16 ఏళ్ల బాలుడు తన ఆట కోసం తన తల్లి బ్యాంకు ఖాతా ఖాళీ చేశాడు. కొడుకు మొబైల్‌ గేమ్‌ కారణంగా అతని తల్లి రూ.36 లక్షలు పోగొట్టుకుని లబోదిబో అంటోంది.

ఫ్రీ గేమ్‌ అనుకుని..
బాలుడు తన తాత మొబైల్‌ ఫోన్‌లో ప్రముఖ ఫ్రీ ఫైర్‌ గేమింగ్‌ యాప్‌ను మొదట డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఇది ఉచిత గేమ్‌ అనుకున్నాడు. కానీ ఆటలో ముందుకు సాగడంతో బాలుడు దాని కోసం కొంత మొత్తాన్ని ఖర్చు చేయడం ప్రారంభించాడు. గేమ్‌ ఆడేందుకు మొదట తన తల్లి ఖాతా నుంచి రూ.1,500, తర్వాత రూ.10 వేలు ఖర్చు చేశాడు. డబ్బులు వస్తుండడంతో గేమ్‌ మరింత ఆసక్తిగా మారింది. దీంతో క్రమంగా అతను గేమ్‌కు బానిస అయ్యాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండానే భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చెల్లించడం మొదలు పెట్టాడు.

డబ్బుల కోసం బ్యాంకుకు వెళితే..
ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసైన బాలుడు క్రమంగా గేమ్‌ కోసం రూ.1.45 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తూ వచ్చాడు. డబ్బుల కోసం బాలుడి తల్లి ఓ రోజు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కి వెళ్లింది. తన బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోవడంతో అవాక్కయింది. ఆమె ఖాతా నుంచి రూ.27 లక్షలు ఖర్చయిందని అధికారులు తెలిపారు. ఎస్‌బీఐ ఖాతాతోపాటు, హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా నుంచి కూడా బాలుడు డబ్బులు ఖర్చు చేసినట్లు తెలుసుకుంది. ఎస్‌బీఐ అకౌంట్‌ నుంచి రూ.27 లక్షలు, హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్‌ నుంచి రూ.9 లక్షలు ఆన్‌లైన్‌ గేమ్‌ కోసం వెచ్చించాడు. ఆందోళనకు గురైన బాధితురాలు సైబర్‌ క్రై మ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తండ్రి మరణంతో వచ్చిన డబ్బులు..
బాలుడు 11వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి ఓ పోలీస్‌ అధికారి. ఇటీవలే మరణించాడు. దీంతో ఆయనకు సంబంధించిన డబ్బులు వచ్చాయి. వాటిని తల్లి ఖాతాలో జమ చేసుకుంది. కానీ ఆన్‌లైన్‌ గేమ్‌తో కొడుకు తండ్రి కష్టార్జితం మొత్తాన్ని పొగొట్టాడు. ఈ విషయం తెలిసి ఆ తల్లి కన్నీరు మున్నీరవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version