Anvesh : కొంతకాలంగా బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్లు చేసిన సెలబ్రిటీలపై నా అన్వేషణ అన్వేష్ యుద్ధం ప్రకటించాడు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ.. ఇటీవలి కాలంలో అన్వేష్ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసిన వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. శివ జ్యోతి అలియాస్ జ్యోతక్క, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, ఇతరులపై అన్వేష్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇక కొంతమంది యూట్యూబర్లపై అయితే సంచలన ఆధారాలతో సరికొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల బెట్టింగ్ యాప్స్ పై ఉక్కు పాదం మోపిన నేపథ్యంలో.. “ప్రపంచయాత్రికుడు’ వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. ఇక అప్పట్లో ప్రపంచ యాత్రికుడు.. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో వీడియోలో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్స్ సంబంధించి సంచలన విషయాలను ఆయనతో పంచుకున్నారు.
బెట్టింగ్ యాప్స్ వెనక ప్రభుత్వ పెద్దలు..
మెట్రో రైలులో బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం చేస్తున్నారని ఇటీవల కొంతమంది తెలంగాణ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి చర్చ జరుగుతుండగానే.. ఈ యాప్స్ ప్రచారం వెనుక చాలామంది పెద్దలు ఉన్నారని యూట్యూబ్ అన్వేష్ ఆరోపించాడు. అంతేకాదు దీనికి సంబంధించి కోట్లు చేతులు మారుతున్నాయని అతడు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అన్వేష్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేశారు.. కొంతకాలంగా అన్వేష్ అక్రమంగా బెట్టింగ్ యాప్స్ కు మోసం చేస్తున్న వారిపై యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి చేస్తున్న ప్రమోషన్ పై ప్రపంచ యాత్రికుడు వీడియోలు రూపొందించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలతో పాటు తెలంగాణ డిజిపి జితేందర్, మెట్రో ఎండి ఎన్.వి ఏఎస్ రెడ్డి, మాజీ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఐఏఎస్ అధికారులు దాన కిషోర్, వికాస్ రాజ్ పై సంచలన ఆరోపణలు చేశాడు.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు పచ్చ జెండా ఊపడం ద్వారా మీరు 300 కోట్ల దాకా వసూలు చేశారని అతడు తన వీడియోలో వెల్లడించాడు. ఇక అన్వేష్ పై ఒక కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చాడు. అతడి కంప్లైంట్ ఆధారంగా అన్వేష్ పై తెలంగాణ పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల విశ్వసనీయత దెబ్బతినే విధంగా ఆ యూట్యూబర్ వ్యవహరిస్తున్నాడని.. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉందని ప్రపంచ యాత్రికుడి పై ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్ తన కంప్లైంట్ లో పేర్కొన్నాడు. ఈ వ్యవహారం కాస్త ప్రపంచ యాత్రికుడి అరెస్టుకు దారి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దీనిపై అన్వేష్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.