CS Somesh Kumar- TS High Court: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. కేంద్రంపై కోసంతో ఇటీవలే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ పార్టీ ప్రకటించారు. అట్టహాసంగా ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈనెల 18న ఖమ్మంలో పార్టీ ఆవిర్భావసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇంతలోగా పార్టీని విస్తరించాలని కసరత్తు చేస్తున్నారు. ఏపీ అధ్యక్షుడిని ప్రకటించిన కేసీఆర్, మహారాష్ట్ర, కర్ణాటకలో పార్టీ విస్తరణపై దృష్టిపెట్టారు. కానీ, ఆయనకు వరుసగా తగులుతున్న షాక్‌లు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనీయకుండా చేస్తున్నాయి. మొన్న లిక్కల్ స్కాం, నిన్న సిట్ రద్దు షాక్ ఇవ్వగా. నేడు కేసీఆర్ ముఖ్య అనుచరుడు, నమ్మినబంటు సీఎస్ సోమేష్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందే అని హైకోర్టు తీర్పు ఇవ్వడం అతిపెద్ద షాక్. దాదాపు ఏడాదిన్నరగా సాగుతున్న ఈ వివాదంపై ఎట్టకేలకు తీర్పు వచ్చింది.

ఏరికోరి తెచ్చుకున్న కేసీఆర్..
రాష్ట్ర విభజన సందర్భంగా సోమేష్‌కుమార్‌ను ఏపీకి కేటాయిచింది కేంద్రం. అయితే తనను ఏపీకీ కేటాయించడంపై సోమేష్‌కుమార్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. క్యాట్ ఆదేశాలతో సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. తెలంగాణ సీఎస్‌తోపాటు మరో 15 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు కూడా క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ నిర్ణయాలను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యంతరాల నేపథ్యంలో చీఫ్‌జస్టిస్ ఉజ్జల్ భూయా¯Œ , జస్టిస్ సూరేపల్లి నందా నేతృత్వంలో విచారణ జరిపారు.
ఆ అధికారం కేంద్రానిదే..
అఖిలభారత సర్వీసు అధికారుల కేటాయింపు నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి హైకోర్టులో వాదించారు. కేంద్రం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు ఆలిండియా సర్వీస్ అధికారుల విభజన చేపట్టినందున సోమేష్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సిందేనని ఆయన అవసరం అనుకుంటే ఏపీ నుంచి డిప్యూటేష¯Œ పై తీసుకోవాలని సూచించారు. గతంలో క్యాట్‌లో జరిగిన విచారణలో సిబ్బంది కేటాయింపు అధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిన సంగతి గుర్తు చేశారు. సోమేశ్‌కుమార్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మనసు మార్చుకుందని ప్రశ్నించారు.
సీఎస్ వాదనలు తోసిపుచ్చిన కేంద్రం..
రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన 2014, జూ¯Œ 2 కు ముందు రోజు పీకే.మహంతి రిటైర్ అయ్యారని, ఆయన పేరును విభజన జాబితాలో చేర్చి ఉంటే తాను తెలంగాణ క్యాడర్‌లో ఉండేవాడినని సీఎస్ సోమే‹శ్‌కుమార్ వాదించారు. అయితే ఆయన వాదనల్ని కేంద్రం తోసిపుచ్చింది. సర్వీసు పూర్తయిన వ్యక్తిని కేటాయింపు జాబితాలో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. పీకే.మహంతి కుమార్తె, అల్లుడు కోసం తనపై వివక్ష చూపారన్న వాదన్నలి కేంద్రం తిరస్కరించింది. అధికారుల విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీలో పీకే.మహంతి ఎక్స్ అఫిషియో సభ్యుడు మాత్రమేనని, మిగతా సభ్యులుండగా వివక్షకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. అధికారుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించే వరకు మహంతి పాత్ర పరిమితమని డీవోపీటీ స్పష్టం చేసింది. అధికారుల కేటాయింపులో ఎవరు ఏ రాష్ట్రానికి వెళ్తారనే విషయం సభ్యులకు తెలిసే అవకాశం లేదని స్పష్టంచేశారు. తెలంగాణకు వెళ్లేందుకు తనకు స్వాపింగ్ అవకాశం ఇవ్వలేదన్న వాదనలు డీవోపీటీ తిరస్కరించింది. సోమేష్‌కుమార్ వ్యవహారంలో బ్యాచ్ స్వాపింగ్ అనుమతించామని గుర్తు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం సోమేశ్ ఆంధ్రాకు వెళ్లాల్సిందే అని తీర్పు ఇచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల అధికారిగా..
ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పదవిలో సోమేశ్‌కుమార్ కొనసాగారు. తెలంగాణ ఏర్పడ్డాకా 2017లో ఏపీకి అలాట్ అయ్యారు. కానీ, ఆ తర్వాత తెలంగాణకు బదిలీ అయ్యారు. సీఎం కేసీఆర్ చొరవతో ఇక్కడే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆనేక ఆరోపణలు..
సీఎస్ సోమేష్‌కుమార్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. పరిపాలన విధానంలో తోటి ఐఏఎస్ అధికారులను లెక్క చేయరనే వాదనలున్నాయి. వాటితోపాటు ధరణి పోర్టల్ నిర్మాణంలో తలెత్తుతోన్న లోపాలపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వీఆర్‌ఏ పేస్కేల్ ఫైల్ ముందుకు కదపకుండా తనవద్దే అట్టిపెట్టుకున్నాడనే వాదనలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో భారత ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ కూడా ఆయన పని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనితీరుపై వివాదాలు..
సీఎస్ సోమేష్ కుమార్ పనితీరుపై వివాదాలు తలెత్తుతున్న తరుణంలో ప్రభుత్వమే ఆయన్ని తప్పించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ కేడర్ ఐఏఎస్ అధికారులకు ప్రయార్టీ ఇస్తున్నారనే దానిపై కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం గుర్రుగా ఉన్నారు. ఈ అసంతృప్తి, ఆరోపణలు కూడా ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఆయన్ని కలిసేందుకు ప్రయత్నిస్తే.. కనీసం వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ప్రజాప్రతినిధులు వాపోయేవారు.
కోర్టు తీర్పుతో ప్రజాప్రతినిధులకు ఊరట..
తాజాగా హైకోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలకు ఊరట లభించగా, కేసీఆర్‌కు మాత్రం షాక్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వంతో అన్నీ తానై నడిపించిన సీఎస్ సోమేష్‌కుమార్ కోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.