Pathaan Telugu Trailer: 90లలో బాలీవుడ్ లో ఏకఛత్రాధిపత్యం చేశాడు షారుక్ ఖాన్. అయితే పరిస్థితి మారింది. బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ సంగతి దేవుడెరుగు… ఆయన సక్సెస్ ముఖం చూసి ఏళ్ళు గడిచి పోతుంది. ఈ క్రమంలో అనేక ప్రయోగాలు చేశారు. ఏవీ ఫలితం ఇవ్వలేదు. చేసేది లేక కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్నారు. ఎలాగైనా ఒక బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కసితో పఠాన్ చిత్రం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కించిన పఠాన్ ట్రైలర్ దుమ్మురేపింది. హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పఠాన్ తెరకెక్కించారు.

రెండున్నర నిమిషాల పఠాన్ ట్రైలర్ గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. కిరాయి టెర్రరిస్ట్ గ్రూప్ ఇండియాను టార్గెట్ చేస్తుంది. ఆ గ్రూప్ నాయకుడు జాన్ అబ్రహం ఇండియాకు సవాల్ విసురుతాడు. బలమైన శత్రువును కట్టడి చేసేందుకు ఇండియా వద్ద ఉన్న ఒకే ఒక హోప్ షారుక్. జాన్ అబ్రహంని వేటాడేందుకు రంగంలోకి దిగిన షారుక్ కి దీపికా పదుకొనె తోడవుతుంది. వారిద్దరూ జాన్ అబ్రహం ఆట ఎలా కట్టించారనేది సినిమా కథ.
మెరుపు ఛేజ్ లు , ఊపిరి బిగ్గట్టేలా చేసే సాహసాలు, ఎన్నడూ చూడని లొకేషన్స్, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పఠాన్ ట్రైలర్ ని నింపేశారు. అత్యున్నత నిర్మాణ విలువలు కలిగి ఉన్న పఠాన్ ట్రైలర్, ది బెస్ట్ అని చెప్పవచ్చు. షారుక్ అవతార్ అదిరిపోగా.. విలన్ గా జాన్ అబ్రహం యాటిట్యూడ్, మేనరిజమ్స్ మెప్పిస్తున్నాయి. పఠాన్ ట్రైలర్ లో చెప్పుకోవాల్సిన మరో అంశం దీపికా గ్లామర్, ఆమె లుక్. హాలీవుడ్ యాక్షన్ హీరోయిన్స్ ని ఆమె గుర్తు చేశారు. దీపికా పదుకొనె డిఫరెంట్ గెటప్స్ సరికొత్త అనుభూతి పంచాయి.

జనవరి 25న పఠాన్ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలవుతుంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పఠాన్ ట్రైలర్ ఉంది. ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి షారుక్ లో కనిపించింది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. అలాగే దేశభక్తి జోడించి పఠాన్ రూపొందించారు. విశాల్ అండ్ శేఖర్ మ్యూజిక్ అందించారు. థియేటర్లో ప్రేక్షకులు ఒక క్వాలిటీ ఫిల్మ్ ఎంజాయ్ చేయబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. వార్ అనంతరం బాలీవుడ్ లో తెరకెక్కిన బెస్ట్ యాక్షన్ మూవీ పఠాన్ అని చెప్పవచ్చు.