Pawan Kalyan- BJP: పవన్ కు బీజేపీ ఎర వేస్తోంది. సీఎం పదవి ఆశ చూపుతోంది. బాబుతో వెళ్లకుండా చివరి ప్రయత్నం చేస్తోంది. అధికారంలోకి వస్తే పవనే సీఎం అంటూ టెంప్ట్ చేస్తోంది. చంద్రబాబుతో వెళ్తే పవన్ సీఎం కాలేరని చెబుతోంది. తాము తల్చుకుంటే అధికార పీఠాలు కదిలించగలమని బీరాలు పలుకుతోంది. పవన్ ను సీఎం చేయడం చిటికలో పని అన్నట్టుగా సంకేతాలు పంపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

బాబు, పవన్ కలయికతో బీజేపీలో కలవరం మొదలైంది. మిత్రుడిని కాపాడుకునేందుకు అస్త్రశస్త్రాల్ని వాడుతున్నట్టు వినికిడి. చివరి అస్త్రంగా సీఎం పదవి ఆశ చూపుతోందన్న చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకున్నా పవన్ కళ్యాణ్ ను సీఎం చేయగల సత్తా ఉందని సంకేతాలు పంపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు పలు రాష్ట్రాల్లో బీజేపీ చేసిన ప్రయోగాల్ని, వాటి ఫలితాల్ని ఉదహరిస్తోంది.
అనాదిగా ఏపీలో అధికార మార్పిడి రెండు పార్టీల మధ్యే సాగుతోంది. మూడో పార్టీకి అవకాశం రావడం లేదు. కానీ గత చరిత్ర మరోసారి పునరావృతం కాదని, ఈ సారి ప్రజలు భిన్నమైన తీర్పు ఇస్తారని బీజేపీ భావిస్తున్నట్టు చర్చ నడుస్తోంది. జగన్ పై వ్యతిరేకతతో టీడీపీని కాకుండా.. మూడో ప్రత్యామ్నాయానికి పట్టం కడతారని నమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ లో జరిగిన అధికార మార్పిడిని ఉదహరిస్తోంది. కానీ అన్ని చోట్ల ఒకే పరిస్థితి ఉండదన్న వాస్తవాన్ని గ్రహించినట్టు కనిపించడంలేదు.

పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణం పై స్పష్టతతో ఉన్నారు. బీజేపీ ప్రతిపాదనను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ, బీజేపీ, జనసేనల కలయికతో ఎన్నికలకు వెళ్లే ప్రతిపాదన వస్తే అందుకు సుముఖంగా ఉండే పరిస్థితి ఉంది. అంతే కానీ బీజేపీ ఎరకు బలయ్యే పరిస్థితి కనిపించడంలేదు.