
Chandrababu- Janasena: పవన్ కళ్యాణ్ కావాలి.. కానీ జనసేన బలపడకూడదు..ఇప్పుడు చంద్రబాబు అండ్ కో స్టాండ్ ఇదే. ఒక వైపు పొత్తు కోసం స్నేహ హస్తం అందిస్తూనే.. జనసేన బలం తగ్గించేందుకు ఎల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. చాలా మంది నాయకులు జనసేన వైపు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నా రకరకాల ఇక్వేషన్స్ చెప్పి చంద్రబాబు టీడీపీలోకి లాగేసుకుంటున్నారు. అయితే దీనిని పవన్ గుర్తించినట్టున్నారు. అందుకే రివర్స్ స్ట్రాటజీతో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. జనసేనలోకి రప్పిస్తున్నారు. ఇప్పటివరకూ పొత్తుల దిశగా ఉన్న టీడీపీ, జనసేనల మధ్య వాతావరణం కాస్తా భిన్నంగా కనిపిస్తోంది. జనసేనను బలం తగ్గించి చూపాలన్న ప్రయత్నంలో చంద్రబాబే చేజేతులా పొత్తు ధర్మానికి విఘాతం కల్పిస్తున్నారన్న టాక్ ప్రారంభమైంది.
వైసీపీ విముక్త ఏపీ కోసం కృషిచేస్తానని పవన్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని శపధం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని కూడా స్పష్టం చేశారు. దీంతో పొత్తులకు ఒక రకమైన సానుకూల వాతావరణం ఏర్పడింది. పవన్ అభిమానులు సైతం పొత్తులకు సై అన్నారు. గౌరవప్రదమైన సీట్లతో పాటు సీఎం పదవి షేరింగ్ కు డిమాండ్ చేశారు. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడినట్టు వార్తలు వచ్చాయి. అయితే పవన్ ను వదులుకుంటే జరిగే మూల్యం చంద్రబాబుకు తెలుసు కనుక కొత్త ఆలోచనకు తెరతీశారు. పవన్ నాయకత్వాన్ని హైలెట్ చేస్తూనే జనసేన బలపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి ఎల్లో మీడియా ఇతోధికంగా సాయపడుతుంది. తప్పుడు రాతలతో పవన్ ను బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తోంది.

వాస్తవానికి చాలామంది తటస్థులు, వివిధ పార్టీల నుంచి సీనియర్లు జనసేనలోకి వచ్చేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. కానీ ఇంతలో టీడీపీ సోషల్ మీడియా పొత్తు కుదిరిపోయిందని.. 20 నుంచి 28 సీట్లు జనసేనకు ఇచ్చే చాన్స్ ఉందని ప్రచారం చేస్తున్నారు. దీంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఎలాగూ పొత్తు కుదిరింది కనుక పెద్ద పార్టీ అయిన టీడీపీయే సేఫ్ జోన్ అని అందులో చేరుతున్నారు. తొలుత కన్నా లక్ష్మీనారాయణ, మహాసేన రాజేష్ వంటి వారు జనసేనలో చేరేందుకు డిసైడ్ అయ్యారు. అన్నిరకాల సన్నాహాలు చేసుకున్నారు. కానీ చంద్రబాబు అండ్ కో మాత్రం వారిద్దర్నీ ఎగురేసుకుపోయింది. అదే సమయంలో పవన్ నామ జపాన్ని అటు చంద్రబాబు, ఇటు లోకేష్, టీడీపీ శ్రేణులు విడిచిపెట్టడం లేదు. దీంతో టీడీపీ ఒక రకమైన మైండ్ గేమ్ కు తెరతీసినట్టయ్యింది.
అయితే పవన్ వాస్తవాన్ని గ్రహించారో లేదో కానీ.. పార్టీకి అండదండగా నిలుస్తున్న సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య జరుగుతున్న తతంగాన్ని బయటపెట్టారు. పవన్ ను సమర్థిస్తూనే జనసేనను బలహీనం చేసే కుట్రను బయటకు వెల్లడించారు. చంద్రబాబుతో కాస్తా జాగ్రత్తగానే ఉండాలని హెచ్చరికలు పంపారు. దీంతో పవన్ కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును పార్టీలోకి చేర్చుకొని చంద్రబాబుకు గట్టి హెచ్చరికలే పంపారు. అయితే పొత్తులకు ప్రయత్నిస్తునే రెండు పార్టీలు నాయకుల చేరికకు ప్రయత్నిస్తున్నాయి. అయితే అధికార పార్టీ నుంచి చేరికలు ప్రారంభమయితేనే అటు చంద్రబాబుకు, ఇటు పవన్ కు కలిసి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.