
Pawan Kalyan- Kapu: ఏపీలో కాపులు సంఘటితమవుతున్నారా? ఇదే మంచి తరుణమని భావిస్తున్నారా? పవన్ కళ్యాణ్ ద్వారా తమ బలమైన ఆకాంక్షను తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారా? పవర్ షేరింగ్ కు , పవన్ సీఎం అభ్యర్థిత్వాన్ని బలపరిచే పార్టీకి జై కొట్టాలని డిసైడయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అన్నికాపు సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఇదే విషయం గంటాపధంగా చెబుతుండడంతో అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని రెండు పార్టీల శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. అయితే సీట్ల సర్దుబాటు, అధికారం పంచుకోవడం వంటి వాటి విషయంలో కొన్ని చిక్కుముళ్లు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కాపులు సంఘటితమవుతున్నారు. పవన్ ను ఆదరించి, గౌరవించి, అధికారం షేరింగ్ ఇచ్చే పార్టీతో కలిసి వెళ్లాలని బలంగా కోరుకుంటున్నారు.
ఇటీవల ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ తన కాలమ్ లో పవన్ పై కొన్ని రాతలు రాశారు. ఏపీలో బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తే రూ.1000 కోట్ల ఆఫర్ ప్రకటించినట్టు రాసుకొచ్చారు. ఇది పెద్ద దుమారమే రేపింది. రాధాక్రిష్ణ తీరుపై జన సైనికులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే అంశం తెరపైకి వస్తోంది. కేసీఆర్ నిజాయితీగా వస్తే తెలంగాణ, ఏపీలో కూడా జనసేనకు గౌరవప్రదమైన స్థానాలు ఇస్తే.. బీఆర్ఎస్ కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు కంటే కేసీఆరే మేలని భావిస్తున్నారు. నాడు కేసీఆర్ ఆంద్రోళ్లను తిట్టలేదని.. అక్కడ సంపదను దోచుకున్న కమ్మ, రెడ్లను మాత్రమే తిట్టారని చెబుతున్నారు. కాపుల విషయంలో కేసీఆర్ ఎప్పుడూ గౌరవభావంతోనే చూసుకున్నారని గుర్తుచేస్తున్నారు.
అయితే ఏపీలో జనసేన బలపడకూదన్న పార్టీల్లో టీడీపీయే ముందంజలో ఉందని ఎక్కువ మంది కాపు నేతలు అనుమానిస్తున్నారు. పవన్ ప్యాకేజీ నాయకుడు, దత్తపుత్రుడని వైసీపీ చేస్తున్న ఆరోపణలను చంద్రబాబు అండ్ కో ఎప్పుడు ఖండించిన దాఖలాలు లేవు. 2014లో ప్రధాని మోదీ, తాను పిలిస్తే పవన్ వచ్చారని ఏ సందర్భంలో కూడా చంద్రబాబు చెప్పడం లేదు. సినిమాల్లో వందల కోట్ల రూపాయలు సంపాదించే పవన్ కు ఆ అవసరమే లేదని.. తామెప్పుడు సాయం చేయలేదని ఏనాడూ చంద్రబాబు ప్రకటించలేదు. కేవలం అవసరాన్ని ఆసరాగా చేసుకొని చంద్రబాబు పావులు కదుపుతూ వస్తున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని కాపు సంఘం నాయకులు గుర్తుచేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు బాయ్ కట్ చేశారు. 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయాలు చేశానని చెప్పుకునే చంద్రబాబే అధికార పార్టీ దాష్టీకాలకు భయపడ్డారు. కానీ జనసేన మాత్రం వీరోచిత పోరాటం చేసింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందని భయపడి పవన్ కు చంద్రబాబు స్నేహ హస్తం అందించారు. కలిసి నడుద్దామని ప్రతిపాదన పెట్టారు. ఇప్పుడు సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చేసరికి పలుచన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియాకు, అనుకూల సోషల్ మీడియాలో పవన్ పై లేనిపోని ప్రచారం చేస్తున్నారు. దీంతోనే కాపులు, కాపు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపులు సంఘటితంగా ఉండి అండగా నిలబడాలంటే పవన్ టీడీపీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరమైతే బీఆర్ఎస్, బీజేపీతో జతకట్టాలని సూచిస్తున్నారు.