Tamanna: చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ కి పెద్దగా మైలేజ్ ఉండదు. ఎంత పెద్ద స్టార్ అయినా పట్టుమని పదేళ్లు కొనసాగడం కష్టమే. దీనికి భిన్నంగా తమన్నా కెరీర్ సాగుతుంది. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు దాటిపోయినా తమన్నా జోరు తగ్గలేదు. ఇప్పటికీ హీరోయిన్ గా క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. హిందీ, తెలుగు భాషల్లో చిత్రాలు చేస్తూ బిజీ కెరీర్ లీడ్ చేస్తున్నారు. తాజాగా మళయాళంలో కూడా అడుగుపెట్టారు. ఇంత వరకు మలయాళంలో ఒక్క సినిమా కూడా చేయని తమన్నా ఆ కోరిక కూడా తీర్చుకోనుంది.

ఫేడ్ అవుట్ కావాల్సిన దశలో చిరంజీవి వంటి స్టార్స్ పక్కన ఛాన్స్ కొట్టేస్తుంది. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ రూపొందుతుంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించడం మరో విశేషం. చిరంజీవితో తమన్నాకు ఇది రెండో చిత్రం. గతంలో సైరా నరసింహారెడ్డి మూవీలో తమన్నా-చిరు జతకట్టారు. మెగా ఫ్యామిలీ హీరోలైన చరణ్, పవన్, అల్లు అర్జున్ లను కూడా కవర్ చేసిన ఘనత తమన్నా సొంతం.
సత్యదేవ్ కి జంటగా గుర్తుందా సీతాకాలం మూవీ చేస్తున్నారు. బోల్ చుడియాన్ అనే హిందీ చిత్రంలో తమన్నా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న బోల్ చుడియాన్ విడుదల కావాల్సి ఉంది. కాగా దీపావళి పండగ నాడు కూడా తమన్నా షూటింగ్స్ కారణంగా తీరిక లేకుండా ఉందట. ఈ క్రమంలో ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
దీపావళి పండగ వేళ కూడా పని చేయడం నాకు ఇష్టం లేదు. అయితే ఇక్కడున్న సిబ్బందితో పండగ జరుపుకోవడం సంతోషాన్ని కలిగిస్తుంది. దాని కోసం నేను ఎదురు చూస్తున్నాను. నాకు అవకాశాలిచ్చి ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు. అభిమానుల ప్రేమాభిమానాలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. అందుకు కృతజ్ఞతలు. అభిమానుల ప్రేమ నాకు పని చేయడానికి కావాల్సిన ఉత్సాహం ఇస్తుందని, తమన్నా అభిప్రాయపడ్డారు. ‘శ్రీ’ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన తమన్నా హ్యాపీ డేస్, 100 % లవ్ చిత్రాలతో హీరోయిన్ గా నిలదొక్కుకున్నారు.