Sunil Gavaskar : కాకపోతే ఈసారి సునీల్ గవాస్కర్ ఎవరి మీదా విమర్శలు చేయలేదు.. అలాగని ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు.. ఈసారి అతడు తన ఉదార గుణాన్ని చాటుకున్నాడు. తన దాతృత్వాన్ని ప్రదర్శించాడు.. ఇంతకీ ఎవరి విషయంలో అంటే.. టీమిండియా ఒకప్పటి గొప్ప ఆటగాడు, సచిన్ టెండూల్కర్ కు దగ్గర స్నేహితుడు వినోద్ కాంబ్లీ కి సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు.. తన ఆధ్వర్యంలో నడుస్తున్న సునీల్ గవాస్కర్ ఫౌండేషన్ ద్వారా ప్రతినెల వినోద్ కాంబ్లీ కి ₹30,000 ఇవ్వనున్నాడు. అంతేకాదు ప్రతి ఏడాదికి ఒకసారి మందుల కోసం ₹30,000 ఇవ్వనున్నాడు.. దీనికి సంబంధించిన వివరాలను సునీల్ గవాస్కర్ వెల్లడించారు.. ” వినోద్ కాంబ్లీ ఆరోగ్యం బాగోలేదు. ఇటీవల రమాకాంత్ ఆచ్రేకర్ విగ్రహావిష్కరణ ముంబైలో జరిగింది. ఆ కార్యక్రమానికి వినోద్ కాంబ్లీ వచ్చాడు. అప్పుడు ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అతని దుస్థితి చూసి చలించిపోయాను. అతడికి ఏదైనా చేయాలని అనుకున్నాను. చివరికి నా ఆధ్వర్యంలో సాగుతున్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదుకోవాలని నిర్ణయించాను. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని” సునీల్ గవాస్కర్ ఓ ఆంగ్ల మీడియాతో వ్యాఖ్యానించాడు.
Also Read : ధోని కళ్లు మూసుకొని కొట్టినా ఔట్.. అట్లుంటది మరీ.. వైరల్ వీడియో
అనారోగ్యం.. ఆర్థిక ఇబ్బందులు
ఒకప్పుడు సచిన్ కంటే ఎక్కువ పరుగులు చేసి.. సచిన్ కంటే గొప్పగా ఆడిన చరిత్ర వినోద్ కాంబ్లీది. అటువంటి ఆటగాడు దారి తప్పాడు. క్రమశిక్షణ లోపించి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. చివరికి అనారోగ్యం పాలయ్యాడు. ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గతాన్ని కూడా దాదాపు మర్చిపోయాడు.. మూత్రపిండ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలను వినోద్ కాంబ్లీ ఎదుర్కొంటున్నాడు. ఆర్థిక పరిస్థితి కూడా బాగో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో అతడి దుస్థితి గమనించి సునీల్ గవాస్కర్ ఆర్థికంగా అండగా నిలవాలని భావించాడు. దానికి తగ్గట్టుగానే తన ఆధ్వర్యంలో నడుస్తున్న సునీల్ గవాస్కర్ ఫౌండేషన్ ద్వారా ప్రతినెల 30 వేల తో పాటు, ప్రతి ఏడాదికి మందుల కోసం మరో 30,000 ఇవ్వాలని నిర్ణయించాడు. అయితే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ నగదు సహాయం అందేలాగా సునీల్ గవాస్కర్ ఏర్పాట్లు చేశాడు. అయితే వినోద్ కాంబ్లీ కి ఉన్న అనారోగ్య సమస్యలకు ఈ నగదు సరిపోదని తెలుస్తోంది. మిగతా లెజెండరీ క్రికెటర్లు కూడా వినోద్ కాంబ్లీని ఆదుకోవడానికి ముందుకు వస్తారని తెలుస్తోంది.. మొత్తానికి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వినోద్ కాంబ్లీకి అండగా నిలవడం పట్ల సునీల్ గవాస్కర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ” సునీల్ గవాస్కర్ మంచి నిర్ణయం తీసుకున్నారు. వినోద్ కాంబ్లి కి అండగా నిలిచారు. ఒక గొప్ప ఆటగాడికి ఇలాంటి దుస్థితి రావడం నిజంగా బాధాకరమని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read : మ్యాచ్ ల గతి, గమనాన్ని మార్చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ !