BUTTERFLY Rhyme Dance Vira: ఇంగ్లీష్ అంటే మన పిల్లల్లో చాలామందికి భయం ఉంటుంది. అలాంటి భయం పోగొట్టడానికి.. ఇంగ్లీష్ ను మన వాడుక భాష చేసేందుకు ఏపీలో కొంతమంది ఉపాధ్యాయులు ఒక ప్రయోగం చేశారు. ఈ క్రమంలో బట్టర్ ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అనే రైమ్ ను రూపొందించారు. ఆ రైమ్ ను పిల్లలతో చెప్పించారు. ఆ రైమ్ కాస్తా తరగతి గదుల గోడలు దాటి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అమెరికా నుంచి మొదలు పెడితే ఆఫ్రికా వరకు అందరి చేత కాళ్లు కదిపేలా చేస్తోంది. సరిగ్గా ఏపీ లోని పిల్లలు ఆలపించిన బట్టర్ ఫ్లై రైమ్ కు ఆఫ్రికాలోని కొంతమంది యువకులు లయబద్ధంగా కాళ్లు కదిపారు.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట ట్రెండింగ్ అయింది.
ఇన్ స్టా గ్రామ్ లో కిలి పాల్ అనే ఐడి నుంచి ఒక వీడియో విడుదలైంది.ఏపీ రాష్ట్రంలో ఎంతో పాపులర్ అయిన బటర్ ఫ్లై, వేర్ ఆర్ యు గోయింగ్ అనే రైమ్ ను అనుకరిస్తూ కొంతమంది ఆఫ్రికన్ ఆదిమ తెగలకు చెందిన యువకులు డాన్స్ వేయడం ప్రారంభించారు. బ్యాక్ గ్రౌండ్ లో చిన్నారులు పాడిన రైమ్ వినిపిస్తుండగా ఆఫ్రికన్ ఆదివాసి యువకులు చేసిన స్టెప్పులు అలరిస్తున్నాయి. వారి వస్త్రధారణ కూడా భిన్నంగా ఉండడంతో నెటిజన్లు లైకుల మీద లైకులు కొడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సంపాదించుకుంది. 1,37,000 మంది ఈ వీడియోను ఇష్టపడ్డారు. 1258 మంది ఈ వీడియో పై తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.. ఈ వీడియో చూసిన కొంతమంది సీతాకోకచిలుక కూడా అసూయపడే విధంగా ఈ ఆఫ్రికన్ జాతులకు చెందిన యువకులు డ్యాన్స్ చేశారని కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఎక్కడో ఏపీలో విద్యార్థుల్లో ఇంగ్లీష్ పట్ల ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ఉపాధ్యాయులు బట్టర్ ఫ్లై అనే రైమ్ రూపొందిస్తే.. అది రాష్ట్రాలు దాటి దేశాలు దాటి విశ్వవ్యాప్తం అయిపోయింది. బటర్ ఫ్లై అనే రైమ్ ట్రెండింగ్ టాపిక్ అయింది.
నాగరిక ప్రపంచానికి దూరంగా బతుకుతారు అనే అపవాదును ఆఫ్రికన్ ప్రజలు చెరిపి వేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. బట్టర్ ఫ్లై అనే రైమ్ ద్వారా అది తేటతెల్లమవుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ కూడా వారి జీవితాల్లోకి ప్రవేశించింది. కాకపోతే వారు ఆదిమ జాతులకు చెందిన వారు కాబట్టి వారి వస్త్రధారణను అలానే కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పాటలకు లయబద్ధంగా డ్యాన్సులు వేస్తూ.. వాటిని వీడియోలుగా తీసి సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేస్తున్నారు. సాధారణంగా ఇటువంటి వీడియోలు చిత్రంగా ఉండటంతో నెటిజన్లు. ఆ వీడియోలను చూసి ఫిదా అవుతున్నారు. అంతేకాదు కామెంట్ల రూపంలో వారిని అభినందిస్తున్నారు. నెటిజన్ల ఆదరణతో ఆ వీడియోలు అనితరసాధ్యమైన వ్యూస్ సంపాదించుకుంటున్నాయి.
