https://oktelugu.com/

Former MLA Son Case: బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసు.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం ఖాళీ

Former MLA Son Case సొహైల్ హిట్ అండ్ రన్ కేసు నేపథ్యంలో.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పని చేస్తే కొంత మంది పోలీస్ సిబ్బంది అంతర్గత వ్యవహారాలను బయటకు చేరవేరుస్తున్నారని ఉన్నతాధికారుల విచారణలో బయటపడింది.

Written By: , Updated On : January 31, 2024 / 03:59 PM IST
Former MLA Son Case
Follow us on

Former MLA Son Case: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు..బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసు.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం బదిలీకి కారణమైంది. గత ఏడాది డిసెంబర్ 25న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ రాష్ డ్రైవింగ్ చేశాడు. పంజాగుట్ట పరిధిలోని ప్రజా భవన్ బారీ కేడ్ ను గుద్దడంతో అది ధ్వంసమైంది. ఈ దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యాయి. రోడ్డు ప్రమాదం తర్వాత సోహైల్ ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు కానిస్టేబుళ్ళు తరలించారు. అంతలోనే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఆ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ సోహైల్ కి బదులుగా షకీల్ ఇంట్లో పని చేసే పనిమనిషిని కేసులో చేర్చారు. సీన్ కట్ చేస్తే మాజీ ఎమ్మెల్యే కుమారుడు విదేశాలకు వెళ్లిపోయాడు. ఈ వ్యవహారంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ళ కు పాత్ర ఉందని పోలీసుల విచారణలో తేలింది. అలాగే సోహైల్ తో కొంతమంది పోలీసులు ఫోన్ లో మాట్లాడినట్టు గుర్తించారు. రోడ్డు ప్రమాదం తర్వాత మాజీ ఎమ్మెల్యే కుమారుడు దేశం దాటడంలో సహకరించిన పోలీస్ అధికారులు బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ హస్తం కూడా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు ప్రేమ్ కుమార్ ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. విచారణ తర్వాత కూడా మరికొంతమంది అరెస్టయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

సొహైల్ హిట్ అండ్ రన్ కేసు నేపథ్యంలో.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పని చేస్తే కొంత మంది పోలీస్ సిబ్బంది అంతర్గత వ్యవహారాలను బయటకు చేరవేరుస్తున్నారని ఉన్నతాధికారుల విచారణలో బయటపడింది. దీంతో ఈ విషయం మీద హైదరాబాద్ సిటీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తీవ్రంగా దృష్టి సారించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది పంతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బందిని మొత్తం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డుల వరకు అందర్నీ ఆర్మ్ డ్ రిజర్వు కు అటాచ్ చేశారు. 86 మంది పోలీస్ సిబ్బంది ఒకేసారి బదిలీ చేయడం రాష్ట్ర పోలీస్ శాఖలో ఇదే తొలిసారి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇటీవల కాలంలో పలు వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే పోలీస్ స్టేషన్ లో అంతర్గత సమాచారం కొందరి సిబ్బంది తీరు వల్ల బయటికి పొక్కుతోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీ శ్రీనివాసరెడ్డి.. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్ని బుధవారం బదిలీ చేశారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నుంచి హోంగార్డు వరకు మొత్తం 84 మంది షిఫ్ట్ ల వారీగా పనిచేస్తుంటారు. సీఐలు, ఎస్సైలు మినహా మిగతా కొంతమంది సిబ్బంది కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పాతుకు పోయారు. ఫలితంగా స్టేషన్ లో జరిగే అంతర్గత వ్యవహారాలు బయటికి పొక్కుతున్నాయి. ముఖ్యంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ రష్ డ్రైవింగ్ కేసు వ్యవహారంలో పలు కీలక విషయాలు బయటకి పొక్కాయి. దీంతో షకిల్ కుమారుడు సోహైల్ విదేశాలకు పారిపోయాడని పోలీసుల అంతర్గత విచారణలో తేలింది. అంతేకాదు ఇక్కడ పని చేసే కొంత మంది పోలీస్ సిబ్బంది కీలకమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాజీ ప్రభుత్వ పెద్దలకు అందిస్తున్నారు. ఇది పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్న నేపథ్యంలో సీపీ శ్రీనివాస్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి.. పనిచేస్తున్న సిబ్బంది మొత్తం పై వేటు వేసినట్టు తెలుస్తోంది. ఇక పంజాగుట్ట రాష్ డ్రైవింగ్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు సోహైల్ కు అప్పట్లో ఇక్కడ పనిచేసిన ఇన్ స్పెక్టర్ దుర్గారావు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆరోజు జరిగిన ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ మొత్తాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారని విమర్శలున్నాయి. మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు సోహైల్ ను తీసుకెళ్లిన అనంతరం మంతనాలు జరిగాయని.. సోహైల్ బదులు షకీల్ ఇంట్లో పనిచేసే పనిమనిషిని ఆ కేసులో ఇరికించారని.. దీంతో సోహైల్ పోలీసుల సహాయంతో విదేశాలకు పారిపోయాడని విమర్శలున్నాయి. పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ దుర్గారావు, నైట్ షిఫ్ట్ ఎస్సై, కొందరు కానిస్టేబుళ్లు, బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని పోలీసులు జరిపిన అంతర్గత విచారణలో తేలింది. ఇప్పటికే ప్రేమ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. దుర్గారావు కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర పోలీస్ శాఖలో సంచలనంగా మారింది.