Thiruvur : అమ్మ కోసం తాజ్‌మహల్‌.. షాజహాన్‌నే మించిపోయావ్‌.. ఫిదా అవుతున్న జనం!

తమిళనాడుకు చెందిన ఒక కోటీశ్వరుడు తన తల్లికి గుర్తుగా ఈ తాజ్‌మహల్‌ నిర్మించారు. అమ్మ జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి పాల రాతితో మరో తాజ్‌మహల్‌ నిర్మించాడు తమిళనాడులోని తిరువరూర్‌ జిల్లాకు చెందిన అమ్రుద్దీన్‌ షేక్‌ దావూద్‌.

Written By: Raj Shekar, Updated On : June 11, 2023 4:55 pm
Follow us on

Thiruvur : ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి తాజ్‌మహల్‌.. ఈపేరు వినగానే మనం ప్రేమకు చిహ్నంగా ప్రతి ఒక్కరూ భావిస్తారు. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌ మహల్‌పై ప్రేమకు గుర్తుగా దీనిని ఆగ్రాలో నిర్మించాడు. తాజ్‌ మహల్‌ గురించి అందరికీ తెలుసు. దీనిని చూసిన పర్యాటకులు ఎవరైనా ప్రపంచంలో ఇలాంటి కట్టడాన్ని మరొకటి చూడలేం అని అనుకుంటారు. షాజహాన్‌ ఆలోచన కూడా ఇదే. ప్రపంచంలో తాజ్‌ మహల్‌ లాంటి కట్టడం మరెక్కడా ఉండకూడదని. అందుకే ఈ అద్భుతమైన నిర్మాణానికి పాటుపడిన కార్మికుల చేతులను ఆయన నరికి వేయించాడని చెబుతారు. అయితే తర్వాత క్రమంలో తాజ్‌మహల్‌ను పోలిన అనేక నిర్మాణాలు జరిగాయి. అయినా.. తాజ్‌మహల్‌ ప్రాధాన్యత ఇసుమంత కూడా తగ్గలేదు. షాజహాన్‌ భార్యపై ప్రేమతో తాజ్‌మహల్‌ కడితే.. ఇక్కడో కొడుకు తన తల్లిపై ప్రేమకు చిహ్నంగా మరో తాజ్‌మహల్‌ నిర్మించాడు. దీనిని చూసిన జనం ఫిదా అవుతున్నారు. షాజహాన్‌ను మించిపోయావ్‌ అంటూ అభినందిస్తున్నారు.

తిరువరూర్‌లో నిర్మాణం.. 

తమిళనాడుకు చెందిన ఒక కోటీశ్వరుడు తన తల్లికి గుర్తుగా ఈ తాజ్‌మహల్‌ నిర్మించారు. ఇందుకోసం లెక్కలేనంత సొమ్ము ఖర్చు చేశాడు. అమ్మే తన జీవిత సర్వస్వం అని అతను చెప్పుకొచ్చాడు. అమ్మ చనిపోయినప్పుడు ఎంతో కుమిలిపోయానని అన్నాడు. అమ్మ జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి పాల రాతితో మరో తాజ్‌మహల్‌ నిర్మించాడు తమిళనాడులోని తిరువరూర్‌ జిల్లాకు చెందిన అమ్రుద్దీన్‌ షేక్‌ దావూద్‌.

తల్లి జ్ఞాపకాల కోసమే.. 

అమ్రుద్దీన్‌ షేక్‌ దావూద్‌ తల్లి బీవీ 2020లో అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అమ్రుద్దీన్‌ ఎంతగానో కుంగిపోయాడు. తల్లే అమ్రుద్దీన్‌ శక్తి. 1989లో రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన తరువాత ఆమె తన ఐదుగురు పిల్లలను పెంచిపోషించారు. ఆ సమయంలో ఆమె వయసు 30 ఏళ్లు మాత్రమే. భర్తను కోల్పోయాక ఆమె మరో వివాహం చేసుకోలేదు. పిల్లలను పెంచి పోషించేందుకు ఎంతో కష్టపడ్డారు. తండ్రిలేడనే లోటు తెలియకుండా పిల్లలను చూసుకున్నారు. 2020లో బీవీ మరణానంతరం తల్లి జ్ఞాపకాలను అమ్రుద్దీన్‌ మరచిపోలేకపోయాడు. ఆమె తమతోనే ఉందని భావించారు. తిరువూరులో తమకు ఉన్న భూమిలో తల్లిని ఖననం చేశారు.

డ్రీమ్‌ బిల్డర్స్‌ సహాయంతో..
తరువాత డ్రీమ్‌ బిల్డర్స్‌ను సంప్రదించి, తాజ్‌మహల్‌ ప్రతిరూపాన్ని అక్కడ నిర్మించారు. ఎకరాభూమిలో 8 వేల చదరపు అడుగులలో నిర్మితమైన ఈ తాజ్‌మహల్‌ నిర్మాణం కోసం 200 మంది పనిచేశారు. ఈ నిర్మాణం కోసం రూ.5 కోట్లు ఖర్చు చేశారు. ఈ తాజ్‌మహల్‌ను చూసినవారంతా అద్భుతంగా ఉందని అంటున్నారు. కాగా ఈ భవనాన్ని చిన్నారులకు విద్యనందించేందుకు, ముస్లింలు నమాజ్‌ పఠించేందుకు వినియోగించనున్నామని అమ్రుద్దీన్‌ తెలిపారు.