Kaikala Satyanarayana Assets: 25 ఏళ్ల ప్రాయంలో వెండితెరకు పరిచయమైన కైకాల సత్యనారాయణ 85 ఏళ్ల వయసులో కూడా నటించారు. అంటే నటుడిగా ఆరు దశాబ్దాల ప్రయాణం ఆయనది. 777 సినిమాల్లో నటించారంటే అర్థం చేసుకోవచ్చు కళామతల్లికి ఆయన ఎంతటి సేవ చేశారో. విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ఇలా విలక్షణ పాత్రలు చేశారు. కొన్ని రకాల పాత్రలకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. కరుడు గట్టిన విలన్ పాత్రలతో పాటు కరుణ కురిపించే తండ్రి పాత్రలు కూడా ఆయన చేశారు. అత్యంత సహజంగా నటించే అతికొద్ది మంది నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు .

ఇన్ని వందల చిత్రాల్లో నటించిన కైకాల ఎంత సంపాదించారు? ఆయన ఆస్తుల వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. కైకాల సినిమాను కళగానే చూశారు. డిమాండ్ ఉన్నప్పటికీ నిర్మాతలను రెమ్యూనరేషన్స్ కోసం ఇబ్బంది పెట్టలేదు. ఇన్నేళ్ళ కెరీర్లో ఆయనపై ఒక దర్శకుడు కానీ నిర్మాత కానీ కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు. చాలా క్రమశిక్షణ కలిగిన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. న్యాయబద్ధమైన రెమ్యూనరేషన్ ఆయన తీసుకున్నారు.
అలాగే సినిమాల్లో సంపాదించిన డబ్బులు నిర్మాతగా మారి అక్కడే పెట్టుబడి పెట్టారు . ఆ రోజుల్లో అరాకొరా రెమ్యూనరేషన్ తీసుకునే నటులు సినిమా నిర్మాణం చేపట్టడం నిజంగా సాహసం. ఇప్పటి మాదిరి ఒక సినిమాకు థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అంటూ ఏమీ ఉండవు. సినిమా థియేటర్స్ లో ఆడితేనే డబ్బులు. లేదంటే మొత్తంగా పోయేవి. రమా ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించి కైకాల.. . బంగారు కుటుంబం, గజదొంగ, ఇద్దరు దొంగలు, కొదమ సింహం, ముద్దుల మొగుడు చిత్రాలు నిర్మించారు. వీటిలో సక్సెస్ అయిన చిత్రాలు తక్కువే.

ఈ క్రమంలో నటుడిగా కైకాల పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రూ. 67 లక్షలు విలువ చేసే ఒక మెర్సిడెజ్ బెంజ్, రూ. 29 లక్షల విలువ చేసే ఇన్నోవా క్రిస్టా కార్లు ఉన్నాయి. గచ్చిబౌలిలో గల నాగార్జున రెసిడెన్సీ అపార్ట్మెంట్స్ సముదాయంలో ఆయనకు ఒక ఫ్లాట్ ఉంది. కైకాల అక్కడే కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నారు. దాని విలువ రూ. 1.5 కోట్లు ఉండవచ్చు. అలాగే బెంగుళూరులో ఒక ఇల్లు ఉన్నట్లు సమాచారం. కైకాల ఇద్దరు కుమారులు వ్యాపారస్తులుగా స్థిర పడ్డారట. ఎన్నడూ మీడియా ముందుకు రాని వారి గురించి స్పష్టమైన సమాచారం లేదు.