Ranchi: నిందితులు ఎక్కువ రోజులు తప్పించుకోలేరనే నానుడి ఈ ఘటనను బట్టి అర్థమవుతుంది. ఎప్పుడో ఏడేళ్ల క్రితం జరిగిన హత్యలకు అసలు కారకులను గుర్తించేందుకు పోలీసులకు ఏడేళ్ల సమయం పట్టింది. తీవ్ర మనస్థాపానికి గురైన ఓ డాక్టర్ కుటుంబంలోని ఐదుగురిని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం. ఈ హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? ఇంకా కుటుంబంలో మిగిలింది ఎవరు? అన్న ప్రశ్నలు చాలామందికి మనసులో అలాగే మిగిలిపోయాయి.
కుటుంబంలోని ఐదుగురిని హతమార్చాడు. మత్తు ఇంజక్షన్లు ఇవ్వడంతో నిద్రలోకి జారుకున్న కుటుంబ సభ్యులంతా అలాగే కన్నుమూశారు. ఆ తరువాత కత్తితో పొడుచుకొని ఆ డాక్టర్ కూడా కన్నుమూశాడు. 2016 అక్టోబరు 9వ తేదీన జరిగిన ఈ ఘటన చోటుచేసుకుంది. అన్ని పత్రికలలో పతాక శీర్షికలతో ప్రచురితమైంది. ఏకంగా ఒకే అపార్ట్ మెంట్లో ఆరు మృతదేహాలు బయటపడటం సంచలనంగా మారింది. ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టడానికి కారణమేంటనేది మిస్టరీగానే మిగిలిపోయింది. తాజాగా పోలీసులు ఈ కేసు ఛేదించి అసలు కారకురాలు ఓ మహిళ అని తేల్చారు.
ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు విచారణ ఆరంభించారు. సంక్షిష్టంగా మారిన కేసును ఛేదించడం కష్టతరంగా మారింది. ఎట్టకేలకు హత్యలకు కారణం సదరు డాక్టర్ కోడలే అని నిర్ధారణకు వచ్చారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని విలాసవంతమైన ఓ అపార్ట్ మెంట్లో డాక్టర్ సుకాంతో సర్కార్ కుటుంబంతో ఉండేవాడు. అయితే, ఆయన కోడలు మధుమిత వేధింపులు ఎక్కువవడం, కుటుంబ పరువు పోతుందని తీవ్ర మనస్థాపానికి గురైన డాక్టర్ సుకాంతో.. తన భార్య అంజలి, కొడుకు సుమిత్, మనవరాలు సమిత్, బంధువు పార్థివ్ భార్య మోమితా, ఈమె కూతరు సమితకు విషపు ఇంజక్షన్లు ఇచ్చాడు. ఆ తరువాత ఆయన కూడా కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కోడలు మధుమిత ఆస్తి కోసం డాక్టర్ కుటుంబాన్ని వేధింపులకు గురిచేసేదని పోలీసులు తెలిపారు. వరకట్న వేధింపులు, లైంగిక వేధింపుల కేసు పెడతానంటూ, రకరకాలుగా మానసికంగా హింసపెట్టడంతో డాక్టర్ సుకాంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు. ఇందుకు ఓ ఎన్నారై కూడా సహకరించినట్లు నిర్థారణకు వచ్చారు. ఆస్తి మొత్తం తన పేరు మీద రాయాలని బెదిరింపులకు పాల్పడేదని అన్నారు. ఈ మేరకు సుకాంతో రాసిన ఓ సుసైడ్ నోట్ చాలా కాలం తరువాత పోలీసుల కంట పడింది. దానిని స్వాధీనం చేసుకొని ఆ దిశగా విచారించగా, కోడలే కుటుంబంలోని హత్యలకు కారకురాలని నిర్థారించారు.