Ashu Reddy: నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. తెలుగు పరిశ్రమ కూడా డ్రగ్స్ ఊబిలో కూరుకుపోయిందని ఈ సంఘటన రుజువు చేస్తుంది. 2018లో టాలీవుడ్ ప్రముఖులైన రవితేజ, ఛార్మి, పూరి జగన్నాథ్, తరుణ్, నవదీప్, సుబ్బరాజ్ తో పాటు మరికొందరు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. విచారణకు హాజరయ్యారు. గత ఏడాది ఈ డ్రగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రానా, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు వినిపించాయి. తాజాగా నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు.
ఈ డ్రగ్ కేసులో పలువురు చిత్ర ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అషురెడ్డి, సురేఖావాణి, జ్యోతి అతనితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరు కేపీ చౌదరితో నైట్ పార్టీల్లో దిగిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అషురెడ్డితో వందలసార్లు కేపీ చౌదరి ఫోన్లో మాట్లాడాడని సమాచారం. ఈ క్రమంలో అషురెడ్డికి డ్రగ్ కేసుతో సంబంధం ఉండే ఛాన్స్ ఉంది. ఆమెకు నోటీసులు జారీ చేయనున్నారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మీడియా కథనాలపై అషురెడ్డి అసహనం వ్యక్తం చేసింది. పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు అషురెడ్డి ఓ వీడియో విడుదల చేసింది. అషురెడ్డి మాట్లాడుతూ… ప్రచారం అవుతున్నట్లు ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా కొన్ని మీడియా సంస్థలు నిరాధార కథనాలు ప్రసారం చేస్తున్నాయి. నా పేరును లాగుతున్నారు. నా మొబైల్ నెంబర్ బహిర్గతం చేశారు.
దీని వలన ప్రతి క్షణం నాకు ఫోన్లు వస్తున్నాయి. ఈ టార్చర్ తట్టుకోలేక మొబైల్ వాడటం మానేశాను. నా గురించి ప్రసారం చేసిన నిరాధార కథనాలు తొలగించాలి. లేదంటే నేను పరువు నష్టం దావా వేస్తాను. మీ ప్రసారాలు మానసికంగా కృంగదీస్తున్నాయి. మా ఫామిలీస్, కెరీర్స్ నాశనం అవుతున్నాయి. ఈ వార్తలు రాసే వాళ్ళకు ఫామిలీస్ లేవా?. ఇకనైనా ఆపేయండి. ఆ ఘటన జరిగినప్పుడు నేను ఇండియాలోనే లేను. ఈ మధ్య నేను ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నాను. ఈ ఆరోపణల మీద నేను పోరాడుతాను, అన్నారు.