
Ellora Caves: “పీకాసో చిత్రమా, ఎల్లోరా శిల్పమా” స్వయంవరం సినిమాలో వేణు తొట్టెంపూడి లయ అందాన్ని అభివర్ణిస్తూ పాడుతుంటాడు.. ఎందుకంటే ఎల్లోరా శిల్పాలు అంత అందంగా ఉంటాయి కాబట్టి.. ప్రపంచంలో ఏడు వింతల్ని ఎలా ఎంపిక చేశారో, వాటికి ప్రామాణికం ఏమిటో తెలియదు కానీ.. ఎల్లోరా శిల్పాలను ఆ జాబితాలో చేర్చకపోవడం నిజంగా బాధాకరం.. ఒకవేళ శిలకు ప్రాణం ఉండి, అందులో జీవం తొణికిసలాడితే కనుక అది కచ్చితంగా ఎల్లోరా శిల్పమే అవుతుంది. కనులు తిప్పుకోనియని అందం అజంతా ఎల్లోరా గుహల సొంతం. ఇవి భారతదేశ శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం.
హిందూ, బౌద్ద, జైన మతాలకు సంబంధించిన శిల్పకళారీతులు అజంతా, ఎల్లోరా గుహల వద్ద కొలువుతీరి ఉండటం విశేషం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఘ్రుష్ణే శ్వరుడు ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు. అజంతా ఎల్లోరా గుహల అందాలను, ఇక్కడి శిల్ప సౌందర్యం ఆశ్చర్యాన్ని గొలిపిస్తుంది. ఔరంగాబాద్ కు 107 కిలోమీటర్ల దూరంలో అజంతా గుహలు ఉన్నాయి. 56 మీటర్ల ఎత్తులోని పర్వతాల మీద ఈ గుహలు పడమర నుంచి తూర్పునకు వ్యాపించి ఉన్నాయి. 18 19 లో జాన్ స్మిత్ అనే బ్రిటిష్ అధికారి వీటిని గుర్తించాడు. ఇక్కడ మొత్తం 29 గుహలు ఉన్నాయి. ఆయన ఈ గుహలను ఎక్కడి నుంచయితే చూశాడో ఆ ప్రదేశాన్ని వ్యూ పాయింట్ గా పిలుస్తున్నారు. అక్కడి నుంచి ఈ గుహలకు దారి గుర్రపు నాడా లాగా సన్నగా కనిపిస్తుంది. చుట్టుపక్కల పరిసరాలు, అక్కడి జలపాతాలు ఎంతో అందంగా ఉంటాయి.

పెయింటింగ్ లతో నిండి ఉన్నట్టు కనిపించే ఈ గుహలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. గుహల పైకప్పు, పక్క భాగాలతో బుద్ధుని జీవిత విషయాలను అందంగా చిత్రీకరించారు. గోడలపై బుద్ధుని జీవిత విశేషాలు ఉంటాయి. ఇక ఎడమవైపున ఉన్న హాల్ లో వేటగాడు పన్నిన వల నుంచి పావురాన్ని రక్షిస్తున్న శిబి చక్రవర్తి చిత్రం, ఇతర జాతక కథలు ఇక్కడ ఉన్నాయి. రెండవ గుహలో బుద్ధుని పుట్టుకను చిత్రీకరించారు. దాని పై కప్పు మీద హంసలు బారులు తీరిన దృశ్యం ఎంతో హృద్యంగా ఉంటుంది.. ఇంకా అప్పట్లో వారు వాడిన మఫ్లర్లు, పర్సులు, చెప్పులు కూడా ఈ గోడలపై చిత్రీకరించారు. 16వ నెంబర్ గుహలో బుద్ధుని జీవితంలో ఎదురైన అనేక సంఘటనలను విశదీకరించే చిత్రాలు ఇందులో ఉన్నాయి. క్రీస్తు పూర్వం రెండు నుంచి ఏడు దశాబ్దాల మధ్యకాలంలో వీటిని చిత్రీకరించినట్టు చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి. అప్పుడు వేసిన చిత్రాలకు గల రంగులు ఇప్పటికీ ఉండడం చిత్రంగానే ఉంటుంది.
ఇక ఎల్లోరా గుహలను రాష్ట్ర కూటులు, చాలక్యుల కాలంలో చెప్పారు. ఔరంగాబాద్ కు వాయవ్యంగా 61 కిలోమీటర్ల దూరంలో ఈ గుహలు ఉన్నాయి. కొండలను తొలిచి ఇంత చక్కటి అందాలను చెక్కారంటే మామూలు విషయం కాదు. వీటినిర్మాణంలో ఒక విశిష్టత ఉంటుంది. మొదటిపై అంతస్తు, అందులోని శిల్పాలను చెక్కి, ఆ తర్వాత కింది అంతస్తు, అక్కడ శిల్పాలు చెక్కారు. ఇక్కడ మొత్తం 34 గుహలు ఉన్నాయి. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఈ గుహల అందాలు సందర్శకులను చూపు తిప్పుకోనీయవు. బౌద్ధులకు సంబంధించి 12 గుహలు ఉంటాయి. వీటిని 5-8 శతాబ్దాల మధ్యకాలంలో చెక్కారు. 6-9 శతాబ్దాల కాలంలో చెక్కినవి హిందువుల గుహలు. ఇవి మొత్తం 17. చివరిలో జైనుల గుహలు ఉంటాయి.. ఇవి 8-10 శతబ్దాల మధ్యకాలంలో చెక్కినవి. వీటిని హెరిటేజ్ సైట్లు గా కూడా ప్రభుత్వం గుర్తించింది. అయితే వీటిలో కొన్ని శిథిలావస్థకు చేరాయి.. ఏటా లక్షల మంది వీటిని సందర్శిస్తారు. ప్రభుత్వానికి కూడా ₹కోట్లలో ఆదాయం వస్తున్నది.