
Wanaparthy: అమ్మ.. ఈ రెండక్షరాల పదం ఎంతో ఉన్నతమైనది. సృష్టికి మూలం అమ్మ. జగతికి రూపం అమ్మ. తన బిడ్డలను కడుపులో కాచుకునేది అమ్మ. కొడుకు ఎంత చెడ్డవాడు అయినా.. గొప్పవాడు అయినా.. తల్లికి కొడుకే. మంచి చెడులను కడుపులో దాచుకునే ఉదారత తల్లికి మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడో తనయుడు మృగంలా మారాడు. సమాజం తలగించుకునేలా తనను కని, పెంచి కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లినే చంపేశాడు ఓ కసాయి కొడుకు. అందుకు అతడికి భార్య కూడా సహకరించింది. చంపిన తర్వాత ఆమె మృతదేహాన్ని సంపులో పడేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితులపై దాడి చేశారు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకులలో జరిగింది.
ఇటీవలే కోడలు దాడి..
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకులకు చెందిన శంకరమ్మ(60)కు కొడుకు రాములు, కోడలు శివమ్మ ఉన్నారు. తరచూ ముగ్గురూ గొడవ పడేవారు. ఈ క్రమంలో ఇటీవల శంకరమ్మ, శివమ్మ గొడవ పడ్డారు. ఈ క్రమంలో కోడలు చేసిన దాడిలో శంకరమ్మ కాలు విరిగింది. కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైంది. నవమాసాలు మోసి కని పెంచి పెద్దచేసిన తల్లిని కష్టకాలంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకు తల్లిని పట్టించుకోవడమే మానేశాడు.
చంపి.. సంపులో పడేసి..
ఈ క్రమంలో మంగళవారం ఉదయం శంకరమ్మతో కొడుకు, కోడలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. ఆగ్రహించిన రాములు ఆవేశంగా తల్లిపై దాడిచేశాడు. ఇందుకు శివమ్మ తనవంతు సహకారం అందించింది. అనంతరం ఇద్దరూ కలిసి శంకరమ్మను తీసుకెళ్లి ఇంటి ఆవరణలో ఉన్న సంపులో పడేశారు. అనంతరం శంకరమ్మ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందిందని ఇరుగుపొరుగువారికి సమాచారం అందించారు.

కోడలిపై స్థానికుల దాడి..
తరచూ అత్త శంకరమ్మతో కోడలు శివమ్మ గొడవ పడడంతోపాటు భౌతికంగా దాడిచేయడాన్ని స్థానికులు చాలాసార్లు గమనించారు. తాజాగా గొడవ పడి కొడుకు, కోడలే చంపేశారని భావించిన స్థానికులు కోడలిపై దాడిచేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కొడుకు, కోడలును పోలీసులకు అప్పగించారు. హత్య కేసు నుంచి తప్పించుకోవడానికే నిందితులు సంపులో పడేసి ప్రమాదవ శాత్తు పడినట్లు డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు.