
Cheetah Kuno: ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నమీబియా నుంచి ప్రత్యేకమైన విమానంలో ఆరు చీతాలను తెచ్చారు గుర్తుంది కదా! వాటిని మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వదిలారు. అయితే అవి అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు కొద్దిరోజుల పాటు ప్రీ ఎన్ క్లోజర్ లో ఉంచారు. తర్వాత వాటిని కూనో నేషనల్ పార్కులో వదిలారు.. అయితే చీతాల్లో రెండు అడవి వదిలి సమీప గ్రామాల్లోకి వెళ్లాయి. తర్వాత వాటిని అటవీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ చీతాల్లో రెండు మృతి చెందాయి. దీంతో జీవావరణాన్ని మరచి చీతాలను తీసుకొచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఫ్రికన్ ఖండానికి చెందిన చీతాలను భారత్ లో ప్రవేశపెట్టడం ప్రణాళిక రహితంగా జరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొందరు పర్యావరణవేత్తలు మోదీ ప్లాన్ వికటించిందని చెబుతున్నారు.
ప్రాదేశిక జీవావరణాన్ని పరిగణలోకి తీసుకోకుండా చీతాలను కూనో జాతీయ పార్కులో వదిలి పెట్టడం వల్ల పొరుగున ఉన్న గ్రామస్తులతో వాటికి ఘర్షణ ఏర్పడవచ్చని అప్పట్లోనే పర్యావరణవేత్తలు హెచ్చరించారు. ఇప్పుడు వారి మాటలు నిజమవుతున్నాయి.. వివిధ రకాల జంతువుల్లో వ్యక్తిగతంగా ఒక్కో జంతువు స్వేచ్ఛగా సంచరించాల్సిన పరిధిని ప్రాదేశిక జీవావరణం నిర్దేశిస్తుంది. నమిబియాలోని “లెబనిజ్_ ఐజేడబ్ల్యూ చీతాల పరిశోధన ప్రాజెక్టు” శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం దక్షిణాఫ్రికాలో చీతాలు నివసించే ప్రాదేశిక జీవావరణం చాలా విశాలంగా ఉంటుంది. ఒక్కో జంతువు సంచారానికి కనీసం 100 చదరపు కిలోమీటర్ల పరిధి ఉంటుంది. “కన్జర్వేషన్ సైన్స్ అండ్ ప్రాక్టీస్ జర్నల్ “లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కూనో నేషనల్ పార్క్ చీతాలు సంచరించేందుకు చాలా చిన్నది.. చీతాలు కూనో నేషనల్ పార్క్ దాటి పొరుగున ఉన్న గ్రామాల్లోకి చొరబడే అవకాశం ఉంది.
కూనో పార్కులో వేటాడే స్థల పరిధి ప్రకారం 21 పెద్ద వయసు చీతాలు సంచరించవచ్చని భారత అధికారులు భావించారని తెలుస్తోంది. ఈ అంచనా సరైనది కాదని ప్రస్తుత పరిస్థితులను బట్టి అవగతమవుతోంది. మధ్యప్రదేశ్ లోని కూనో జాతీయ పార్కులో వరుసగా రెండు చీతాలు మరణించడం సంచలనంగా మారింది. సంవత్సరాల వయసు ఉన్న మగ చీత ఉదయ్.. ఫిబ్రవరిలో భారతదేశానికి తెచ్చిన 12 చీతాల్లో ఒకటి. గత ఏడాది నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాల్లో ఒకటైన శాస అనే ఆడ చీతా మార్చి 28న అనారోగ్యంతో మృతి చెందింది. ఇప్పుడు మరో చీతా మృతి చెందడంతో మొత్తం చీతాల సంఖ్య 20 నుంచి 18కి తగ్గింది.

కూనో నేషనల్ పార్క్ అటవీ అధికారుల అధ్యయనం ప్రకారం ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడలేకపోతున్నాయని తెలుస్తోంది. పైగా ఇక్కడి పార్కు చుట్టూ సమీపంలో గ్రామాలు ఉండటంతో చీతాలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాయి. దీనివల్ల అవి సమీప గ్రామాల్లోకి వెళ్తున్నాయి. వాటిని పట్టుకోవడం అటవీ అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. ఇతర జంతువులతో కూడా అవి త్వరగా కలిసిపోలేకపోతున్నాయి. మధ్యప్రదేశ్లో ఎండలు మండిపోతుండడం కూడా చీతాల మరణానికి కారణంగా తెలుస్తోంది. వాస్తవంగా ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే పులి జాతికి చెందిన జంతువుల్లో అనూహ్య మార్పులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అవి ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఆఫ్రికా వాతావరణానికి భిన్నంగా మధ్యప్రదేశ్ వాతావరణం ఉండటంతో చీతాలు మనలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.