
Sai Pallavi: సాయి పల్లవి చేసింది తక్కువ చిత్రాలే అయినా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. దానికి కారణం ఆమె పోషించిన పాత్రలు. కేవలం టాలెంట్ తో ఎదిగిన ఈ తరం హీరోయిన్ సాయి పల్లవి మాత్రమే. నిజానికి ఆమె హీరోయిన్ మెటీరియల్ కాదు. గొప్ప నటన, అద్భుత నృత్యం, కష్టపడే తత్త్వం ఆమెను స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేర్చాయి. అలాగే సాయి పల్లవి తనకంటూ కొన్ని నియమాలు, పద్ధతులు పెట్టుకున్నారు. వాటిని అతిక్రమించి సినిమాలు ఒప్పుకోరు. అది ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా లెక్క చేయరు. పాత్ర నచ్చితే డెబ్యూ హీరోతో కూడా నటిస్తారు. ఇక పొట్టి బట్టలు వేయడం, శృంగార సన్నివేశాల్లో నటించడం చేయరు.
ఈ క్రమంలో సాయి పల్లవి ఇద్దరు బడా స్టార్స్ చిత్రాలు రిజెక్ట్ చేశారట. వారు ఎవరో కాదు అజిత్, విజయ్. కోలీవుడ్ ని ఏలుతున్న వీరిద్దరిని కూడా సాయి పల్లవి లక్ష్య పెట్టలేదంటే ఆమె నమ్మిన సిద్ధాంతానికి ఏ మేరకు కట్టుబడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి కానుకగా విడుదలైన వారసుడు, తెగింపు చిత్రాలకు హీరోయిన్ గా సాయి పల్లవినే అనుకున్నారట. వారసుడు స్క్రిప్ట్ విన్న సాయి పల్లవి చేయనని చెప్పేశారట. పాత్రకు ప్రాధాన్యత లేని కారణంగా రిజెక్ట్ చేశారట.
అనంతరం రష్మిక మందానను తీసుకున్నారు. ఏదో పేరుకు హీరోయిన్ అన్నట్లున్న పాత్ర చేసి రష్మిక పరువు పోగొట్టుకుంది. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా ఒప్పుకున్నారు. కేవలం విజయ్ హీరో అని ఆయనపై ఇష్టంతో మూవీ చేశాను. నా పాత్ర నామమాత్రం అని నాకు తెలుసని రష్మిక మీడియా ముందు చెప్పారు. అలాగే అజిత్ తెగింపు మూవీ ఆఫర్ కూడా సాయి పల్లవి వద్దకు వచ్చిందట. సాయి పల్లవి పాత్ర నచ్చక చేయను అన్నారట. తక్కువలో తక్కువ రెండు నుండి మూడు కోట్ల రూపాయలు సాయి పల్లవి వదులుకున్నట్లే.

ప్రస్తుతం సాయి పల్లవి ఒక తమిళ చిత్రం చేస్తున్నట్లు సమాచారం. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు. రెండు మూడు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. సాయి పల్లవి సినిమాలు తగ్గించేసిన క్రమంలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ పుకార్లను సాయి పల్లవి పరోక్షంగా ఖండించారు. సాయి పల్లవి అంటే ప్రేక్షకులు తమ ఇంట్లో అమ్మాయిగా భావిస్తారు. అందుకే నేను మంచి పాత్రలు చేయాలి. సబ్జెక్టు నచ్చితే భాషా బేధం లేకుండా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక సాయి పల్లవి తెలుగులో నటించిన చివరి చిత్రం విరాటపర్వం.