
Governor Tamilisai- Preethi: సీనియర్ వేధింపుల కారణంగా ఆత్మహత్య యత్నం చేసిన వైద్య విద్యార్థిని ప్రీతిని పరామర్శించేందుకు నిమ్స్ కు వెళ్లిన గవర్నర్ తమిళిసై పూల దండ కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. ప్రీతి సోదరి చేసిన ఆరోపణలకు రాజ్ భవన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
గవర్నర్ పై ప్రీతి సోదరి ఆగ్రహం..హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రెండు రోజుల క్రితం వచ్చారు. ఈ సంద్భంగా ఆమె వెంట ఉన్న వ్యక్తిగత సహాయకుడి చేతిలో పూల్ పూలదండ ఉంది. ఈ దృశ్యం అన్ని టీవీ చానెల్ లో ప్రసారం అయింది. దీనినీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. శుక్రవారం ఆస్పత్రికి వచ్చిన ప్రీతి సోదరి దీప్తి గవర్నర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన సోదరిని ఆస్పత్రిపాలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడింది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. పూలదండతో ఎలా తెస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూల దండలు చనిపోయిన వారికి తీసుకొస్తారని.. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించింది. బాధితురాలికి అన్యాయం చేయకుంటే తమ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతామని హెచ్చరించింది.
మంత్రులు.. ఎమ్మెల్యే లపైనా ఆగ్రహం..
అలాగే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతికి సరైన వైద్యం అందడం లేదని దీప్తి ఆరోపించింది. తన సోదరికి న్యాయం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ పరామర్శించడానికి రావొద్దనీ కోరింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

పూలదండపై క్లారిటీ ఇచ్చిన రాజ్‌భవన్..
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని పరామర్శించేందుకు గవర్నర్ పూలదండతో వచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని రాజ్‌భవన్ తీవ్రంగా ఖండించింది. ఖైరతాబాద్‌లోని హనుమంతుని గుడిలో సమర్పించడానికి కారులో పూలదండ ఉంచామని స్పష్టం చేసింది. గవర్నర్ ఎక్కడికి వెళ్ళినా రాజ్ భవన్‌కు తిరిగి వచ్చేటప్పుడు ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడికి వెళ్లి రావడం చాలా రోజుల నుంచి ఆనవాయితీగా ఉందని స్పష్టం చేసింది. ప్రీతి కోసం హనుమంతుడి గుడిలో గవర్నర్ పూజ కూడా చేశారని తెలిపింది. ఈ విషయాన్ని దుష్ప్రచారం చేయడం, విపరీతార్థాలు తీయడం సరికాదని రాజ్ భవన్ పేర్కొంది. గవర్నర్ రాజ్ భవన్ కు వచ్చిన వెంటనే ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా ఆదేశించారని తెలిపింది. గవర్నర్ నిమ్స్ పర్యటనను సరైన దృష్టితో అర్థం చేసుకోవాలని రాజ్‌భవన్ విజ్ఞప్తి చేసింది.